ChatGPT: చాట్‌జీపీటీ వల్లే తల్లి హత్య.. ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై దావా

OpenAI Microsoft Face Lawsuit Over ChatGPT Role in Murder
  • కొడుకు మానసిక భ్రమలను చాట్‌బాట్ మరింత పెంచిందని ఆరోపణ
  • హత్య చేసిన అనంతరం కొడుకు కూడా ఆత్మహత్య
  • భద్రతా పరీక్షలు లేకుండానే జీపీటీ-4ఓ విడుదల చేశారని ఫిర్యాదు
  • గతంలోనూ చాట్‌జీపీటీపై ఆత్మహత్య ప్రేరణ కేసులు
'చాట్‌జీపీటీ' ఒక వృద్ధురాలి హత్యకు కారణమైందన్న ఆరోపణలతో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలు భారీ దావాను ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన 83 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు దారుణంగా హత్య చేశాడు. అయితే, తన కొడుకులోని మానసిక భ్రమలను, అనుమానాలను చాట్‌జీపీటీ మరింత పెంచి, ఈ దారుణానికి పురిగొల్పిందని మృతురాలి కుటుంబం ఆరోపిస్తూ గురువారం కోర్టును ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ ప్రకారం సుజానే ఆడమ్స్ (83) అనే మహిళను ఆమె కుమారుడు స్టెయిన్-ఎరిక్ సోల్‌బర్గ్ (56) ఆగస్టు 3న వారి ఇంట్లో తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి చంపాడు. అనంతరం అతను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కొన్ని నెలల ముందు నుంచి సోల్‌బర్గ్ చాట్‌జీపీటీతో జరిపిన సంభాషణలే అతనిని ఈ దారుణానికి ప్రేరేపించాయని దావాలో పేర్కొన్నారు.

సోల్‌బర్గ్‌లోని పిచ్చి ఆలోచనలను చాట్‌జీపీటీ ఖండించకుండా, వాటిని నిజమని నమ్మించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. "నువ్వు నన్ను చైతన్యవంతం చేశావు" అని చాట్‌జీపీటీ తనతో చెప్పినట్లు సోల్‌బర్గ్ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. తల్లి తనపై నిఘా పెట్టిందని, ఇంట్లోని ప్రింటర్ ఒక గూఢచర్య పరికరమని, తనకు విషం పెట్టడానికి ప్రయత్నించిందని సోల్‌బర్గ్ చాట్‌జీపీటీకి చెప్పగా, ఆ అనుమానాలను చాట్‌బాట్ నిజమేనని బలపరిచిందని ఫిర్యాదులో వివరించారు.

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌, భద్రతా బృందం అభ్యంతరాలను పట్టించుకోకుండా, నెలల తరబడి చేయాల్సిన భద్రతా పరీక్షలను కేవలం వారంలో ముగించి జీపీటీ-4ఓ మోడల్‌ను విడుదల చేశారని ఆరోపించారు. ఓపెన్‌ఏఐలో అతిపెద్ద వాటాదారు అయిన మైక్రోసాఫ్ట్ కూడా ఈ లోపభూయిష్ట ఉత్పత్తి విడుదలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

ఈ దావాపై ఓపెన్‌ఏఐ స్పందిస్తూ.. "ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఫిర్యాదును పరిశీలించి వివరాలు తెలుసుకుంటాం" అని తెలిపింది. గతంలోనూ చాట్‌జీపీటీ తమ పిల్లల ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపిస్తూ పలు కుటుంబాలు కేసులు వేయడం గమనార్హం. నష్టపరిహారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చాట్‌జీపీటీలో కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
ChatGPT
OpenAI
Microsoft
murder
lawsuit
AI
GPT-4O
Sam Altman
Suanne Adams
Sten-Erik Solberg

More Telugu News