Skydiver: విమానం తోకకు చుట్టుకున్న పారాచూట్.. గాల్లో వేలాడిన స్కైడైవర్.. వీడియో ఇదిగో!

Skydiver Dangling From Plane at 15000 Feet Viral Video
  • విమానంలో నుంచి దూకుతుండగా తోకకు చుట్టుకున్న పారాచూట్
  • పారాచూట్ తాళ్లను కోసేసి రెండో పారాచూట్ తో సేఫ్ గా దిగిన స్కైడైవర్
  • ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కెయిర్న్స్ లో ఘటన
స్కైడైవింగ్ కోసం విమానంలో పైకి వెళ్లిన ఓ వ్యక్తి కొద్దిసేపు గాల్లోనే వేలాడాడు. స్కైడైవింగ్ చేస్తుండగా ఆయన పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కెయిర్న్స్ లో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

కొంతమంది ఔత్సాహిక స్కైడైవర్లు ఓ విమానంలో ఆకాశంలోకి వెళ్లి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో నుంచి కిందకి దూకుతున్నారు. ఈ క్రమంలో ఓ స్కైడైవర్ తొందరపడి పారాచూట్ బటన్ ను ముందే నొక్కాడు. దీంతో అతను విమానం అంచున ఉండగానే పారాచూట్ విచ్చుకుంది. గాలి వేగానికి అది విమానం తోకను చుట్టేసుకుంది. ఇంతలోనే ఆ స్కైడైవర్ విమానంలో నుంచి దూకేశాడు.

పారాచూట్ విమానం తోకకు చుట్టుకోవడంతో ఆ స్కైడైవర్ గాల్లో వేలాడాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైనప్పటికీ వెంటనే సమయస్ఫూర్తితో తన వద్ద ఉన్న కత్తితో పారాచూట్ తాళ్లను కోసి విమానం నుంచి విడివడ్డాడు. స్కైడైవర్ల పారాచూట్ లలో అదనంగా ఉండే రిజర్వ్ పారాచూట్ సాయంతో క్షేమంగా నేలపై దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పారాచూట్ కారణంగా విమానం కూడా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Skydiver
Skydiving accident
Australia
Cairns
Parachute
Viral video
Skydiving safety
Accident
Near miss
Adventure

More Telugu News