Birth Tourism: అమెరికాలో ప్రసవం కోసం వెళుతున్నారా?.. వీసాపై కీలక ప్రకటన

US To Reject Tourist Visa If Applicant Plans To Give Birth During Stay
  • అమెరికాలో ప్రసవం కోసం వెళ్లేవారికి టూరిస్ట్ వీసా నిరాకరణ
  • పౌరసత్వం కోసం అడ్డదారులను మూసివేసేందుకే ఈ నిర్ణయం
  • భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్ప‌ష్టీక‌ర‌ణ‌
అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం సంపాదించాలని భావించే వారికి ఆ దేశ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కేవలం ప్రసవం కోసమే అమెరికాకు వెళ్లాలని ప్రణాళిక రచించుకునే గర్భిణులకు టూరిస్ట్ వీసాలు నిరాకరించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

అమెరికా చట్టాల ప్రకారం, ఆ దేశ భూభాగంపై జన్మించిన వారికి సహజంగానే పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధనను కొందరు అవకాశంగా తీసుకుని, టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్లి ప్రసవానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి 'బర్త్ టూరిజం' ద్వారా పౌరసత్వం పొందే అడ్డదారులను మూసివేయాలన్న లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. తాజాగా దీనిపై భారత్‌లోని అమెరికా ఎంబసీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ ద్వారా స్పష్టతనిచ్చింది.

"కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనివ్వాలన్న ప్రాథమిక ఉద్దేశంతోనే ఎవరైనా వీసాకు దరఖాస్తు చేసుకున్నారని తెలిసినా లేదా అనుమానం వచ్చినా, వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోం. కాన్సులేట్ అధికారులు అలాంటి వారికి టూరిస్ట్ వీసాలను తిరస్కరిస్తారు. దీనికి ఎలాంటి అనుమతి లేదు" అని ఎంబసీ తన పోస్టులో పేర్కొంది. ఈ నిర్ణయంతో నిజమైన పర్యాటక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బంది ఉండదు కానీ, కేవలం ప్రసవాన్ని కారణంగా చూపి వీసా కోసం ప్రయత్నించేవారికి మాత్రం నిరాశ తప్పదు.
Birth Tourism
US Visa
America Citizenship
Trump Administration
US Embassy India
Tourist Visa
Childbirth USA
American Embassy
Citizenship by birth
Visa denial

More Telugu News