Mexico: చైనా, భారత్ సహా పలు దేశాలపై మెక్సికో భారీగా సుంకాలు

Mexico Imposes Heavy Tariffs on China India and Other Countries
  • ఆసియా దేశాలకు చెందిన 1,400 ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాల విధింపు
  • వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానున్న అధిక సుంకాలు
  • చైనా, భారత్‌, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా ఉత్పత్తులపై సుంకాలు
దిగుమతి వస్తువులపై మెక్సికో కూడా అమెరికా బాటలో పయనిస్తోంది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన దాదాపు 1,400 ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాల విధింపునకు అక్కడి సెనేట్ ఆమోదం తెలిపింది. వచ్చే జనవరి నుంచి అధిక సుంకాలు అమల్లోకి రానున్నాయి.

చైనా, భారత్‌తో పాటు దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాల నుంచి దుగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, విడిభాగాలు, టెక్స్‌టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులపై సుంకాలు పెంచాలని మెక్సికో ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఆ దేశ ఆర్థిక మంత్రి సెప్టెంబరులోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభలో అధికార మోరేనా పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ మద్దతు లభించలేదు. తాజాగా మద్దతు లభించడం గమనార్హం. అధిక సుంకాల విధింపునకు సెనెట్ ఆమోదం తెలపడంపై అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు.

దేశీయ ఉత్పత్తి పెంచడం, చైనాతో వాణిజ్య సమతౌల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో అధిక సుంకాల విధింపు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా తెలిపారు. అమెరికాను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా క్లాడియా ప్రభుత్వం అధిక సుంకాలను విధించి ఉంటుందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Mexico
Mexico Tariffs
China
India
Asian Countries
Import Tariffs
Trade

More Telugu News