Chandrababu Naidu: రేపు విశాఖలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన... కాగ్నిజెంట్, సత్వా క్యాంపస్‌లకు భూమి పూజ

Chandrababu Naidu Nara Lokesh to Launch IT Projects in Visakhapatnam
  • విశాఖలో కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ భారీ పెట్టుబడులు
  • రేపు రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, మంత్రి లోకేశ్
  • మరో 7 ఐటీ క్యాంపస్ లకు కూడా భూమిపూజ చేయనున్న లోకేశ్
  • రూ.3000 కోట్లకు పైగా పెట్టుబడులు, 33 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు
  • ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత విశాఖపట్నం ఐటీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. నగరాభివృద్ధిలో కీలక మైలురాళ్లుగా నిలిచే రెండు భారీ ప్రాజెక్టులకు రేపు (డిసెంబరు 12) శ్రీకారం చుట్టనున్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌తో పాటు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ తమ క్యాంపస్‌ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా విశాఖలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా 33 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.

విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల్లో నిర్మించనున్న కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఈ సంస్థ రూ.1,583 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ఈ క్యాంపస్‌ను నిర్మించనుంది. దీని ద్వారా 8 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2033 నాటికి నిర్మాణం పూర్తి కానుండగా, మొదటి దశను 2029 నాటికి పూర్తి చేసి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. 

ఈ నేపథ్యంలో, రుషికొండలోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభిస్తారు. ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది.

మరోవైపు, దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ విశాఖ మధురవాడలోని హిల్-4లో నిర్మించనున్న 'సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్‌'కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా 40 వేల నుంచి 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ క్యాంపస్‌లో కేవలం ఐటీ కార్యాలయాలే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో నివాసాలు, రిటైల్, హాస్పిటాలిటీ సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించిన సత్వా గ్రూప్, విశాఖలో రాబోయే ఐదేళ్లలో 4 మిలియన్ చదరపు అడుగుల ఐటీ ఆఫీస్ స్పేస్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖపట్నం త్వరలోనే గ్లోబల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ తో పాటు విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు కూడా నారా లోకేశ్ రేపు భూమిపూజ చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. 

1. టెక్ తమ్మిన (Tech Tammina (Sree Tammina Software Solutions Pvt. Ltd)

విశాఖ మధురవాడలోని ఎస్పీఎల్-4, హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న టెక్ తమ్మిన సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో తన సేవలను అందిస్తోంది.

2. నాన్ రెల్ టెక్నాలజీస్ (Nonrel Technologies Private Limited)

విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

3. ఏసీఎన్ ఇన్ఫోటెక్ (ACN HealthCare RCM Services Pvt Ltd)

విశాఖ ఐటీ సెజ్ హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్ సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థ 12 నెలల్లో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. 

4. ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions (India) Pvt Ltd)

విశాఖ భీమిలిలోని కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

5. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited)

విశాఖ భీమిలి మండలం కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

6. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Limited)

విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్ లో ఏర్పాటుకానున్న మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ రూ.109.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

7. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (Quarks Technosoft Pvt Ltd)

విశాఖ కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.115 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

Chandrababu Naidu
Visakhapatnam
Cognizant
Satya Group
Nara Lokesh
Andhra Pradesh
IT Investments
Job Opportunities
Tech Companies
IT Hub

More Telugu News