Donald Trump: రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్లు.. ఎందుకంటే?

Donald Trump offers to Russia for Ukraine peace
  • ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం రష్యాకు ఆఫర్లు ఇస్తున్నట్లు కథనాలు
  • మాస్కోకు అనుకూలంగా ట్రంప్ ఆఫర్లు ఇచ్చారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం
  • రష్యా నుంచి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ప్రతిపాదన
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాస్కోకు అనుకూలంగా ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ఒక కథనంలో పేర్కొంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఇటీవల యూరోపియన్ దేశాలకు అందజేసిన శాంతి ప్రణాళికకు అనుబంధంగా ట్రంప్ ఈ తాజా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనలలో ఐరోపా దేశాలకు రష్యా నుంచి ఇంధన సరఫరాను పునరుద్ధరించడం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆ దేశంలోని అరుదైన ఖనిజ రంగాల్లో పెట్టుబడులతో పాటు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయని సమాచారం.

అమెరికా వ్యాపార, ఆర్థిక సంస్థలు స్తంభింపజేసిన 'రష్యా సార్వభౌమ నిధి'ని ఉక్రెయిన్‌లో ప్రాజెక్టులకు వినియోగించే ప్రణాళికలు కలిగి ఉన్నాయి. వీటిలో జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం శక్తితో ఒక డేటా సెంటర్ ఏర్పాటు, రష్యాలోని అరుదైన ఖనిజాల వెలికితీత, చమురు తవ్వకం వంటి అంశాలు ఉన్నాయి.

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ఇటీవల 28 సూత్రాలతో ఒక శాంతి ప్రణాళికను రూపొందించారు. అయితే, ఇందులో ఎక్కువ అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని నాటో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని సవరణలు సూచించాయి. ఈ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అంశంపై అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Donald Trump
Russia
Ukraine
US Russia relations
Russia Ukraine war
Trump peace plan

More Telugu News