Amaravati Quantum Valley: అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంచలనం... విదేశీ మీడియాలో ఆసక్తికర కథనం

Amaravati Quantum Valley Creates Sensation Report in Foreign Media
  • క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న అమరావతి
  • దక్షిణాసియాలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు
  • ఐబీఎం, టీసీఎస్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం
  • వచ్చే దశాబ్దంలో 50,000 మందికి శిక్షణ, వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం
  • 2030 నాటికి టాప్ 5 గ్లోబల్ క్వాంటం కేంద్రాల్లో ఒకటిగా నిలవాలని ప్రణాళిక
  • ఈ మేరకు ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ లో కథనం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, భవిష్యత్ టెక్నాలజీ అయిన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీలక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. దక్షిణాసియాలోనే మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV)లో ఏర్పాటు చేయడంతో ఈ ప్రస్థానంలో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఇది కేవలం ప్రాంతీయ అభివృద్ధి మాత్రమే కాదని, దేశవ్యాప్త సాంకేతిక పరివర్తనకు నాంది అని, నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీలలో భారత్‌ను ఒక బలమైన శక్తిగా నిలబెడుతుందని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ తన కథనంలో పేర్కొంది.

ఈ బృహత్తర లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తనదైన క్వాంటమ్ మిషన్‌ను ప్రారంభించింది. తద్వారా దేశంలోనే ఈ రంగంలో ముందంజ వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ ప్రయాణంలో అమరావతి ఒంటరిగా ఏమీ వెళ్లడం లేదు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలైన ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యాల ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటు వేగవంతం కానుంది. 

అంతేకాకుండా ఎన్విడియా, ఏడబ్ల్యూఎస్, వైజర్ వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు కూడా పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధి, ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ కోసం అమరావతితో చేతులు కలిపాయి. ఈ అంతర్జాతీయ సహకారంతో అమరావతి ప్రపంచ క్వాంటం ఆవిష్కరణల నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఎదుగుతోంది.

కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ లక్ష్యంతోనే ‘అమరావతి క్వాంటమ్ అకాడమీ’ని ఏర్పాటు చేశారు. రాబోయే దశాబ్దంలో ఈ అకాడమీ ద్వారా 50,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, కనీసం 100 మంది అత్యుత్తమ క్వాంటం పరిశోధకులను, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా వేల సంఖ్యలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది కేవలం ఒక పరిశోధనా కేంద్రం మాత్రమే కాదు. హార్డ్‌వేర్ తయారీ, సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిని ఒకేచోట మేళవించిన ఒక సమీకృత ఎకోసిస్టమ్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ నుంచి మొదలుకొని వాతావరణ మార్పుల నమూనాలు, అంతరిక్ష పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వరకు అనేక రంగాలలో క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2030 నాటికి బోస్టన్, మ్యూనిచ్, సింగపూర్, టోక్యో వంటి ప్రపంచంలోని టాప్ 5 క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతిని నిలపాలనే మహోన్నత లక్ష్యంతో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.
Amaravati Quantum Valley
Quantum Computing India
Andhra Pradesh Technology
133 Qubit Quantum Computer
Quantum Mission AP
IBM TCS Partnership
Nvidia AWS Collaboration
Amaravati Quantum Academy
Quantum Research Hub
Next Gen Technologies

More Telugu News