YS Jagan Mohan Reddy: ఏపీ క్యాబినెట్ భేటీ... కీలక నిర్ణయాలు ఇవే!

AP Cabinet Key Decisions Roads Education and Employee Welfare
  • తాడేపల్లి వద్ద రూ.532 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం
  • ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల కరవు భత్యం మంజూరు
  • గిరిజన పాఠశాలల్లో 417 ఉపాధ్యాయ పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు గ్రీన్ సిగ్నల్
  • కుప్పం చెక్‌డ్యామ్ పనులకు సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర
  • కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త జైళ్ల చట్టం బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యా రంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారి 16పై భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లి వరకు 3.8 కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ఎల్1 బిడ్‌ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టులో ఇంటర్‌ఛేంజ్‌లు, వంతెనలు, అండర్‌పాస్‌లు కూడా భాగంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ రూ.532 కోట్ల 57 లక్షలుగా నిర్ణయించారు.

దీనితో పాటు, చిత్తూరు జిల్లా కుప్పంలోని పలార్ నదిపై ఉన్న చెక్‌డ్యామ్ మరమ్మతులు, పునర్నిర్మాణ పనుల కోసం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ మంజూరు చేసింది. గతంలో రూ.10.24 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.15.96 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులు, విద్యారంగానికి ప్రాధాన్యం
ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ రెండు విడతల కరవు భత్యం (డీఏ) మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3.64 శాతం చొప్పున డీఏ చెల్లించనున్నారు. మరోవైపు, గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని 417 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో 227 తెలుగు, 91 హిందీ భాషా పండితుల పోస్టులతో పాటు 99 వ్యాయామ ఉపాధ్యాయుల (పీడీ) పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల కేడర్‌కు ఉన్నతీకరించారు.

చట్టాలు, బోర్డులపై కీలక నిర్ణయాలు
బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను రద్దు చేస్తూ జైళ్ల సంస్కరణల దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన 'మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023'కు అనుగుణంగా 'ది ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్, 2025' ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 

గంజాయి వంటి నేరాలకు పాల్పడిన ఖైదీలకు సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో సంస్కరణ తీసుకురావడంపై మరింత అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతోపాటు, రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణకు కూడా కేబినెట్ ఆమోదించింది. ఈ బోర్డుకు చైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులను నియమించనున్నారు.

విరూపాక్ష ఆర్గానిక్స్‌కు 100 ఎకరాల భూమి
పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించే క్రమంలో వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. ప్రముఖ సంస్థ విరూపాక్ష ఆర్గానిక్స్‌కు 100 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించింది. అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా తీర్మానించింది.

రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. 
YS Jagan Mohan Reddy
AP Cabinet
Andhra Pradesh
Road Expansion
DA Hike
Education Sector
Jail Reforms
Vizag Chennai Industrial Corridor
Amaravati
Virupaksha Organics

More Telugu News