వైజాగ్‌కు గూగుల్ తెచ్చిన లోకేశ్‌ను విమర్శిస్తారా?: వైసీపీపై యార్లగడ్డ ఫైర్

  • సీఎం, మంత్రుల కృషిపై వైసీపీ విమర్శలు తగవన్న యార్లగడ్డ
  • అమెరికాలో దిగ్గజ కంపెనీలతో లోకేశ్‌ సమావేశమయ్యారని వెల్లడి
  • గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన లోకేశ్‌ను అభినందించాలని హితవు
  • ఓటమి తర్వాత నియోజకవర్గానికి వెళ్లని కొడాలి నానిపై తీవ్ర విమర్శలు
  • జగన్ ఎప్పుడైనా పెట్టుబడుల కోసం తిరిగారా అని బహిరంగ సవాల్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే, వైసీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"75 ఏళ్ల వయసులో చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనలో గూగుల్, అడోబ్, ఎన్విడియా వంటి 18 ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ‘గూగుల్ మర్చిపోదు’ అన్న సినిమా డైలాగ్‌ను నిజం చేస్తూ, రూ.15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్‌ను వైజాగ్‌కు తీసుకొచ్చిన ఘనత లోకేశ్‌ది. అలాంటి వ్యక్తిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదం" అని యార్లగడ్డ అన్నారు.

గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్లి ఇలాంటి కంపెనీలతో సమావేశమయ్యారా అని ఆయన ప్ర‌శ్నించారు. "యువగళం పాదయాత్రకు ముందు లోకేశ్‌ వేరు, తర్వాత లోకేశ్ వేరు. ఆయనతో అరగంట మాట్లాడగలిగే నాయకులు మీ పార్టీలో ఉన్నారా? ఆలోచించుకోండి" అని హితవు పలికారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిపై యార్లగడ్డ తీవ్ర విమర్శలు చేశారు. "గుడివాడ ప్రజలు ఓడించారనే కక్షతో ఏడాది పాటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. అధికారం లేనప్పుడు ప్రజలకు సేవ చేయడమే గొప్పతనం. గతంలో మేం ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నాం" అని గుర్తుచేశారు. 

బూతులు తిట్టడం, అగౌరవంగా మాట్లాడటం మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, కనీసం గౌరవంగా అసెంబ్లీకి రావాలని వైసీపీ నేతలకు ఆయన సూచించారు. అక్రమ కేసుల కారణంగానే తన పాస్‌పోర్ట్ సమస్య వచ్చిందని, అందుకే లోకేశ్‌తో పాటు అమెరికా పర్యటనకు వెళ్లలేకపోయానని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News