Akhanda 2: 'అఖండ 2' సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్... టికెట్ రేట్ల పెంపు జీవో రద్దు

Akhanda 2 Ticket Price Hike GO Cancelled by Telangana High Court
  • 'అఖండ 2' సినిమాకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
  • ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు జీవో సస్పెండ్
  • నిర్మాత, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' చిత్రానికి విడుదల ముందు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే, 'అఖండ 2' సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరలు పెంచుకోవడానికి వీలు కల్పించడాన్ని సవాలు చేస్తూ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వ జీవోను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హోంశాఖ, చిత్ర నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ యాక్షన్ చిత్రం రేపు (డిసెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రాత్రికి ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు.

తాజా కోర్టు ఆదేశాలతో ఇవాళ రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలపై గందరగోళం నెలకొంది. టికెట్ ధరల విషయంలోనూ సందిగ్ధత ఏర్పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
Akhanda 2
Nandamuri Balakrishna
Boyapati Srinu
Telangana High Court
Ticket Price Hike
Movie Release
Sreeleela
Telugu Cinema
Akhanda Movie
Film Development Corporation

More Telugu News