ISRO: ఇస్రో దూకుడు... డిసెంబర్ 15న అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహ ప్రయోగం

ISRO to Launch US Bluebird 6 Satellite on December 15
  • డిసెంబర్ 15న అమెరికా బ్లూబర్డ్-6 ఉపగ్రహ ప్రయోగం
  • ఇస్రో అత్యంత శక్తిమంతమైన LVM3 రాకెట్‌తో ఈ ప్రయోగం
  • బ్లూ బర్డ్-6 కమ్యూనికేషన్ శాటిలైట్ బరువు 6.5 టన్నులు 
  • భారత్-అమెరికా మధ్య ఇది రెండో అతిపెద్ద అంతరిక్ష సహకారం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య ప్రయోగాల్లో మరో కీలక మైలురాయిని అందుకోబోతోంది. అమెరికాకు చెందిన 6.5 టన్నుల బరువున్న 'బ్లూబర్డ్-6' కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని డిసెంబర్ 15న నింగిలోకి పంపనుంది. ఇస్రోకు చెందిన అత్యంత శక్తిమంతమైన లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్న అత్యంత బరువైన ఉపగ్రహాలలో ఇది ఒకటి.

అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం కోసం అక్టోబర్ 19నే ఈ ఉపగ్రహం అమెరికా నుంచి భారత్‌లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. ఇది కక్ష్యలో అతిపెద్ద కమర్షియల్ ఫేజ్డ్ అర్రేను కలిగి ఉంటుందని, గతంలో పంపిన బ్లూబర్డ్ ఉపగ్రహాల కన్నా 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేస్తుందని ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా మధ్య ఇది రెండో అతిపెద్ద సహకారం. గత జూలైలో ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1.5 బిలియన్ డాలర్ల నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

LVM3 రాకెట్ 8,000 కిలోల బరువును లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి, 4,000 కిలోల బరువును జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లగలదు. ఇటీవలే నవంబర్ 2న 4.4 టన్నుల బరువున్న సీఎంఎస్-3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారానే విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ISRO
Bluebird-6
LVM3
AST Space Mobile
Satellite Launch
New Space India Limited
Commercial Space
Satish Dhawan Space Center
NISAR
India US Space Cooperation

More Telugu News