Lionel Messi: మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో

Lionel Messi India Tour 2025 Schedule Tickets and Details
  • ఈ నెల‌ 13 నుంచి 15 వరకు భారత్‌లో లియోనెల్ మెస్సీ పర్యటన
  • కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పలు కార్యక్రమాలు
  • హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్న మెస్సీ
  • ముంబైలో సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా పర్యటనలో చేరిక
  • ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గోట్ ఇండియా టూర్ 2025'కు సమయం ఆసన్నమైంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు రాబోతున్నారు. ఈ నెల‌ 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రముఖులతో సమావేశం కానుండగా, అభిమానులతో ముచ్చటించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం..
13న కోల్‌కతాలో పర్యటన ముగించుకుని మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి రాజీవ్ గాంధీ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 7v7 ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మెస్సీ గౌరవార్థం ఓ సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.

ఇతర నగరాల్లో షెడ్యూల్ ఇదే..
పర్యటనలో భాగంగా కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, నటుడు షారుఖ్ ఖాన్‌లతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముంబైలో జరిగే కార్యక్రమాల్లో మెస్సీతో పాటు అతని సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా పాల్గొంటారని టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా పీటీఐకి తెలిపారు. ముంబైలో సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, చారిటీ ఫ్యాషన్ షో వంటివి నిర్వహించనున్నారు. పర్యటన చివరి రోజున ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కానున్నట్లు సమాచారం.

ఈ టూర్ టికెట్లను 'డిస్ట్రిక్ట్ యాప్' ద్వారా విక్రయిస్తున్నారు. చాలా నగరాల్లో టికెట్ ధర సుమారు రూ. 4,500 నుంచి ప్రారంభం కాగా, ముంబైలో మాత్రం రూ. 8,250 నుంచి మొదలవుతోంది. 2011లో అర్జెంటీనా తరఫున ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కోల్‌కతా వచ్చిన మెస్సీ, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

మెస్సీ టూర్ పూర్తి షెడ్యూల్ ఇలా...

13న‌ కోల్‌కతాలో..

ఉదయం 1:30 గంటలకు కోల్‌కతాకు రాక‌

ఉదయం 9:30 నుంచి 10:30 వరకు: మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం

ఉదయం 10:30 నుంచి 11:15 వరకు: మెస్సీ విగ్రహం ప్రారంభోత్సవం (వర్చువల్‌గా)

ఉదయం 11:15 నుంచి 11:25 వరకు: యువ భారతికి రాక

ఉదయం 11:30 గంటలకు: షారుఖ్ ఖాన్ యువభారతికి రాక‌

మధ్యాహ్నం 12:00 గంటలకు: స్టేడియంకు చేరుకోనున్న‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ 

మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 వరకు: స్నేహపూర్వక మ్యాచ్, సత్కారం

మధ్యాహ్నం 2:00 గంటలకు: హైదరాబాద్ కు ప‌య‌నం

13న‌ హైదరాబాద్‌లో..

రాత్రి 7:00 గంటలకు: రాజీవ్ గాంధీ స్టేడియంలో 7v7 మ్యాచ్. మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య.

ఆ సాయంత్రం సంగీత కచేరీ కూడా ఉంటుంది.

14న ముంబైలో..

మధ్యాహ్నం 3:30 గంటలకు: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే పాడెల్ కప్‌లో పాల్గొంటారు.

సాయంత్రం 4:00 గంటలకు: సెలబ్రిటీల ఫుట్‌బాల్ మ్యాచ్

సాయంత్రం 5:00 గంటలకు: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, తరువాత ఛారిటీ ఫ్యాషన్ షో.

15న‌ న్యూఢిల్లీలో..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం

మధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో మినర్వా అకాడమీ ఆటగాళ్లను సత్కరించే కార్యక్రమం.
Lionel Messi
Messi India Tour
GOAT India Tour 2025
Revanth Reddy
Mamata Banerjee
Shah Rukh Khan
Sourav Ganguly
Football Match
Hyderabad
Kolkata

More Telugu News