భారత్‌లో సేవలకు సిద్ధం.. ఎలాన్ మస్క్ కీలక ట్వీట్‌

  • కేంద్ర మంత్రి సింధియాతో స్టార్‌లింక్ ప్రతినిధుల కీలక భేటీ
  • నగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాలకే ప్రాధాన్యత
  • త్వరలో ప్రభుత్వ అనుమతులు వస్తాయని కంపెనీ ఆశాభావం
ప్రముఖ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. త్వరలోనే దేశంలో తమ సేవలను ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇది పంపింది. ప్రభుత్వంతో స్టార్‌లింక్ బృందం చర్చిస్తున్న తరుణంలో మస్క్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీని విస్తరించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయని సింధియా తెలిపారు. సంప్రదాయ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని చోట్ల ఈ టెక్నాలజీ కీలకం కానుందని ఆయన అన్నారు. దీనికి డ్రేయర్ స్పందిస్తూ దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అయితే, స్టార్‌లింక్ సేవలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమవుతాయని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. సరైన కనెక్టివిటీ లేని లేదా ఖరీదైన, నమ్మకంలేని బ్రాడ్‌బ్యాండ్ ఉన్న ప్రాంతాల కోసమే దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. భౌతిక పరిమితుల కారణంగా జనసాంద్రత అధికంగా ఉండే నగరాల్లో స్టార్‌లింక్ సేవలు అందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి స్టార్‌లింక్ సేవలకు సంబంధించి ప్రభుత్వ తుది అనుమతులు రావాల్సి ఉంది. కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నామని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.



More Telugu News