గవర్నర్ తో జగన్ భేటీ షెడ్యూల్ మార్పు

  • మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ పోరాటం
  • కోటి సంతకాల సేకరణ చేపట్టిన ప్రతిపక్షం
  • ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
ఏపీలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఈ ఆందోళనలో భాగంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించేందుకు ఆ పార్టీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన ఆయన గవర్నర్‌తో భేటీ కానున్నారు. ముందుగా డిసెంబర్ 17న కలవాలని నిర్ణయించినప్పటికీ, షెడ్యూల్‌లో స్వల్ప మార్పుల కారణంగా ఈ భేటీ 18వ తేదీకి వాయిదా పడింది.

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇది ప్రైవేటీకరణేనంటూ వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించి "కోటి సంతకాల సేకరణ" కార్యక్రమాన్ని చేపట్టింది. 

18వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను జగన్ కలుస్తారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి అందజేస్తారు.


More Telugu News