AP Fake Birth Certificates: ఏపీలో నకిలీ జనన ధ్రువపత్రాల దందా.. ఒకే ఊరిలో 3,981 సర్టిఫికెట్ల రద్దు

AP Fake Birth Certificates 3981 Certificates Cancelled in Komarepalli
  • శ్రీసత్యసాయి జిల్లా కొమరేపల్లిలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం
  • 10 నెలల్లో 3,981 నకిలీ ధ్రువపత్రాల జారీ
  • ప్రభుత్వ విచారణతో వెలుగులోకి వచ్చిన భారీ మోసం
  • అన్ని సర్టిఫికెట్లను రద్దు చేసిన ప్రభుత్వం
  • 14 జిల్లాల్లో తనిఖీలకు ఆదేశం
ఏపీలో నకిలీ జనన ధ్రువపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లా, అగళి మండలం, కొమరేపల్లి పంచాయతీ కేంద్రంగా జరిగిన ఈ భారీ మోసాన్ని గుర్తించిన ప్రభుత్వం... అక్కడ జారీ చేసిన 3,981 బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం 1500 లోపే జనాభా ఉన్న కొమరేపల్లి గ్రామంలో 2025 జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు పది నెలల వ్యవధిలోనే దాదాపు నాలుగు వేల జనన ధ్రువపత్రాలు జారీ కావడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. వీటిలో చాలా వరకు ఇతర రాష్ట్రాల వారికి జారీ చేసినట్లు తేలడంతో ఇది వ్యవస్థీకృత మోసమని నిర్ధారించారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

జనన, మరణాల నమోదు శాఖ చీఫ్‌ రిజిస్ట్రార్‌ ఆదేశాలతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి ఫిరోజ్‌బేగం విచారణకు ఆదేశించారు. జిల్లా గణాంక అధికారి కళాధర్‌ నేతృత్వంలోని బృందం జరిపిన విచారణలో కొమరేపల్లి పంచాయతీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను దుర్వినియోగం చేసి ఈ నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు తేలింది.

విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేయడమే కాకుండా బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అనుమానాస్పదంగా అధిక సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ అయిన 14 జిల్లాల్లో పునఃపరిశీలన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో లోతైన విచారణ జరుగుతోంది.
AP Fake Birth Certificates
Andhra Pradesh
Srisatya Sai District
Komarepalli
Fake Certificates Scam
Birth Certificate Fraud
Firoz Begum
Ap News
Telugu News

More Telugu News