G Parameshwara: నోరు జారితే పదేళ్ల జైలు.. ద్వేష ప్రసంగాలపై కర్ణాటక సర్కార్ కఠిన వైఖరి

Karnataka to Punish Hate Speech with Jail Time
  • కర్ణాటకలో ద్వేషపూరిత వ్యాఖ్యల కట్టడికి కొత్త బిల్లు
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హోంమంత్రి పరమేశ్వర
  • తప్పు చేస్తే పదేళ్ల వరకు జైలు, లక్ష రూపాయల జరిమానా
  • నాన్‌బెయిలబుల్ కేసుగా పరిగణించేలా కఠిన నిబంధనలు
  • బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్ష బీజేపీ
ద్వేషపూరిత వ్యాఖ్యలు, విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా శాసనసభ శీతాకాల సమావేశాల్లో 'ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు'ను నిన్న ప్రవేశపెట్టింది. కులం, మతం, లింగం, జన్మస్థలం వంటి అంశాలపై ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

రాష్ట్ర హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర ఈ బిల్లును సభ ముందు ఉంచారు. ఈ బిల్లు ప్రకారం, ప్రజా జీవితంలో ఉన్నవారు, సాధారణ వ్యక్తులు లేదా మరణించిన వారిపై ఉద్దేశపూర్వకంగా చేసే వ్యాఖ్యలు, సంజ్ఞలు, రాతలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చేసే దుష్ప్రచారాన్ని ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తారు. తొలిసారి ఈ నేరానికి పాల్పడితే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మళ్లీ చేస్తే రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు, రూ.లక్ష జరిమానా తప్పదు.

ఈ నేరాలను నాన్‌బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసేలా బిల్లును రూపొందించారు. అయితే, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వ్యతిరేకత తెలిపారు. మూజువాణి ఓటింగ్‌ను కాదని, డివిజన్‌కు పట్టుబట్టారు. అయినప్పటికీ స్పీకర్ యూటీ ఖాదర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. ఈ బిల్లు ప్రభుత్వ అజెండాలో భాగమని, విద్వేష వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ బిల్లు నేడు విధాన పరిషత్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
G Parameshwara
Karnataka government
hate speech bill
anti hate speech bill
DK Shivakumar
Karnataka politics
hate crime
Indian law

More Telugu News