Nara Lokesh: కెనడాలో లోకేశ్ మెగా ఇన్వెస్ట్‌మెంట్ డ్రైవ్... ఏపీలో పెట్టుబడులకు దిగ్గజాలకు ఆహ్వానం

Nara Lokesh Mega Investment Drive in Canada Invites Investments to AP
  • కెనడా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ బిజీబిజీ
  • బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడితో కీలక సమావేశం
  • నల్లమలలో స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విజ్ఞప్తి
  • ఏపీ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు సీపీపీఐబీకి ఆహ్వానం
  • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన కెనడా సంస్థలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కెనడా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా టొరంటోలో ఆయన కెనడాలోని ప్రముఖ వాణిజ్య, ఆర్థిక దిగ్గజాలతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు.

బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడాతో భేటీ
ముందుగా, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (BCC) అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ పాలనానుభవం, దార్శనికతతో గత 18 నెలల్లోనే ఏపీకి రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మాది 'స్పీడ్ ఆఫ్ డూయింగ్' విధానం. 1053 కి.మీ తీరప్రాంతం, ఆరు పోర్టులు, ఆరు విమానాశ్రయాలతో రాష్ట్రం కనెక్టివిటీలో ముందుంది. మరో ఆరు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయి. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. ఏపీలో కెనడియన్ పెట్టుబడిదారులను ప్రోత్సహించండి" అని కోరారు. 

దీనికి గోల్డీ హైదర్ సానుకూలంగా స్పందించారు. తమ కౌన్సిల్‌లో 150కి పైగా ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయని, ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వారి దృష్టికి తీసుకెళ్లి, తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

నల్లమలలో రిసార్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన
అనంతరం, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. "ఫ్లోరిడాలోని పనామా సిటీ తరహాలో నల్లమల అటవీ ప్రాంతంలో మీ అనుబంధ సంస్థ 'స్టెర్లింగ్ రిసార్ట్స్' ద్వారా ఒక ప్రత్యేకమైన రిసార్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి. అలాగే కుప్పంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తిచేసేందుకు సహకరించండి" అని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రేమ్ వాత్సా స్పందిస్తూ, భారత్‌లో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తమకు పెట్టుబడులు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు.

మౌలిక సదుపాయాల రంగంలోకి సీపీపీఐబీ
పర్యటనలో భాగంగా, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (CPPIB) గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ టీమ్ సభ్యుడు టిమ్ డౌనింగ్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీని పునరుత్పాదక ఇంధన హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఉన్నామని, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. "రాష్ట్రంలోని పోర్టులు, లాజిస్టిక్స్, రహదారి ప్రాజెక్టులు, అభివృద్ధి చెందుతున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'మాస్టర్ ఫండ్‌'లో యాంకర్ ఇన్వెస్టర్‌గా భాగస్వాములు కండి" అని ఆహ్వానించారు. 

దీనికి టిమ్ డౌనింగ్ బదులిస్తూ, తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 700 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh investments
Canada investment drive
AP IT Minister
Chandrababu Naidu
Business Council of Canada
Fairfax Financial Holdings
CPPIB
Green energy AP
Tourism investments AP

More Telugu News