Rahul Gandhi: మోదీ, రాహుల్ గాంధీ మధ్య 88 నిమిషాల భేటీ

Rahul Gandhi Narendra Modi Meet for 88 Minutes
  • సీఐసీ, ఇతర కమిషనర్ల నియామకాలపై ప్రధానంగా చర్చ
  • ప్రభుత్వ ప్రతిపాదనలన్నింటికీ అభ్యంతరం తెలిపిన రాహుల్
  • సమావేశాల్లో పాల్గొన్న అమిత్ షా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య ఈరోజు జరిగిన సమావేశం పార్లమెంట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన ఈ భేటీ ఏకంగా 88 నిమిషాల పాటు కొనసాగడం ఊహాగానాలకు తావిచ్చింది. వాస్తవానికి, ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) నియామకంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, ఇది ఇంత సుదీర్ఘంగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు.

నిబంధనల ప్రకారం, సమాచార కమిషన్, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ విభాగాల్లో కీలక నియామకాలపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని కార్యాలయానికి రాహుల్ చేరుకోగా... 1.07 గంటలకు భేటీ ప్రారంభమైంది. అయితే, సమయం గడిచేకొద్దీ సమావేశం అజెండాపై ఎంపీల్లో చర్చ మొదలైంది.

అనంతరం, ఈ భేటీలో కేవలం సీఐసీ నియామకం గురించే కాకుండా, మరో 8 మంది సమాచార కమిషనర్లు, ఒక విజిలెన్స్ కమిషనర్ నియామకాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ నియామకాలన్నింటికీ రాహుల్ గాంధీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని, దానిని లిఖితపూర్వకంగా కూడా సమర్పించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో ఇలాంటి సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు అభ్యంతరాలు తెలపడం సాధారణమే అయినా, ఈసారి భేటీ సుదీర్ఘంగా జరగడమే చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్‌లో సీఐసీతో సహా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న హీరాలాల్ సమారియా పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పదవి ఖాళీగా ఉంది. కమిషన్‌లో దాదాపు 30,838 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Rahul Gandhi
Narendra Modi
Prime Minister
Congress
CIC Appointment
Chief Information Commissioner
Amit Shah
Parliament Winter Session
Information Commissioner
Central Information Commission

More Telugu News