Botsa Satyanarayana: ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగడంలేదు: బొత్స

Botsa Satyanarayana Criticizes Privatization of Medical Education in Andhra Pradesh
  • చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమేనని విమర్శ
  • కోటి సంతకాల సేకరణతో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్న బొత్స
  • రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
రాష్ట్రంలో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జగరడంలేదని అన్నారు. విజయనగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని బొత్స తెలిపారు. త్వరలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. "చంద్రబాబు నైజం ఎప్పుడూ కార్పొరేట్లకు అనుకూలంగానే ఉంటుంది. ఇది కొత్తేమీ కాదు, ఆయన తీరు మొదటి నుంచీ ఇంతే" అని ఆయన వ్యాఖ్యానించారు.

గత వైసీపీ ప్రభుత్వం పేదల కోసం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటికి కనీస నిధులు కూడా ఇవ్వడం లేదని బొత్స ఆరోపించారు. దీనివల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి అనుమతులు రాకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంపై ఉన్న రూ. 2.60 లక్షల కోట్ల అప్పుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి, నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గుర్ల మండలంలో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్ విషయంలో రైతుల అభిప్రాయానికే తమ ప్రాధాన్యత అని బొత్స స్పష్టం చేశారు. ఎక్కువ మంది రైతులు వ్యతిరేకిస్తే, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
Medical Education
Chandrababu Naidu
YSRCP
YS Jagan Mohan Reddy
Privatization
Medical Colleges
Steel Plant
Vizianagaram

More Telugu News