యూట్యూబ్ చూసి ఆపరేషన్.. ప్రాణాలు కోల్పోయిన మహిళ

  • ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘటన
  • అక్రమ క్లినిక్‌లో సర్జరీ వికటించి మహిళ మృతి
  • నిర్వాహకుడు, అతడి మేనల్లుడిపై కేసు నమోదు
  • పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు
యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేయడం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాంటి అర్హత లేకుండా అక్రమంగా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, అతడి మేనల్లుడు కలిసి చేసిన ఈ నిర్వాకంతో ఆమె మృతి చెందింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం... తేజ్‌బహదూర్ రావత్ భార్య మునిశ్రా రావత్ (38) కొంతకాలంగా కడుపులో రాళ్ల సమస్యతో బాధపడుతోంది. ఈ నెల‌ 5న ఆమెను భర్త కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ ఔషధాలయకు తీసుకెళ్లాడు. క్లినిక్ నిర్వాహకుడు గ్యాన్ ప్రకాశ్ మిశ్రా ఆమెను పరీక్షించి, కడుపులో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని చెప్పాడు. ఇందుకు రూ.25,000 ఖర్చవుతుందని చెప్పడంతో బాధితురాలి భర్త ముందుగా రూ.20,000 చెల్లించాడు.

అనంతరం గ్యాన్ ప్రకాశ్ మద్యం మత్తులో యూట్యూబ్ వీడియో చూస్తూ తన మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రాతో కలిసి ఆపరేషన్ ప్రారంభించాడని మృతురాలి భర్త తన ఫిర్యాదులో ఆరోపించారు. సర్జరీ సమయంలో కడుపులో లోతైన కోత పెట్టడంతో పలు నరాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో పరిస్థితి విషమించి త‌ర్వాతి రోజు ఆమె మృతి చెందింది.

నిందితుల్లో ఒకడైన వివేక్ కుమార్ మిశ్రా, రాయ్‌బరేలీలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉద్యోగి అని, ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కొన్నేళ్లుగా ఈ అక్రమ క్లినిక్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం అధికారులు క్లినిక్‌ను సీజ్ చేశారు. నిర్లక్ష్యం కారణంగా మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


More Telugu News