Kavitha Kalvakuntla: ఆ హామీని పూర్తిగా విస్మరించారు: సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

Kavitha Kalvakuntla Fires at CM Revanth Over Unfulfilled Promises
  • సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని సూటి ప్రశ్న
  • జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వంచించారని ఆరోపణ
  • యువత ఆకాంక్షలకు ఓయూ గడ్డపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ విషయంలో యువతను మోసం చేసిందని ఆమె ఆరోపించారు.

"జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ హామీని పూర్తిగా విస్మరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట ఏమైంది?" అని కవిత నిలదీశారు. ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ‘రైజింగ్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. "పోరాటాల పురిటిగడ్డ అయిన ఓయూలో అడుగుపెడుతున్న మీరు, మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం సమాధానం చెబుతారు?" అని ఆమె ప్రశ్నించారు.

"ఉత్తుత్తి మాటలు, జాబ్‌లెస్ క్యాలెండర్లకు కాలం చెల్లింది. రైజింగ్ పేరుతో అబద్ధాలు చెప్పడం కాదు, యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి" అని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు యువత పక్షాన పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.
Kavitha Kalvakuntla
Revanth Reddy
Telangana
BRS
Congress
Job Calendar
Osmania University
Unemployment
Telangana Jagruthi
Rising Telangana

More Telugu News