Donald Trump: వాళ్లకే జన్మతః పౌరసత్వం.. ధనిక వలసదారులకు కాదు: డొనాల్డ్ ట్రంప్

Trump Birthright Citizenship Meant for Slaves Not Immigrants
  • అమెరికాలో జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమేనన్న ట్రంప్
  • ధనిక వలసదారులు లబ్ధి పొందడానికే ఈ విధానం కాదంటూ వ్యాఖ్య
  • ఈ కేసులో సుప్రీంకోర్టులో ఓడిపోతే అది వినాశకరమని హెచ్చరిక
అమెరికాలో జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) అనేది బానిసల పిల్లల కోసం ఉద్దేశించిందే తప్ప, ఇతర దేశాల నుంచి వచ్చే ధనిక వలసదారులు తమ కుటుంబం మొత్తానికి పౌరసత్వం కల్పించుకోవడానికి కాదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికన్ న్యూస్ అవుట్‌లెట్ పొలిటికోతో మాట్లాడుతూ, తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ట్రంప్ సమర్థించుకున్నారు. "చారిత్రకంగా చూస్తే ఈ కేసు అంతర్యుద్ధం సమయంలో బానిసల పిల్లలకు సంబంధించినది. అంతేగానీ, ఏదో ఒక ధనిక దేశం నుంచి వచ్చిన వ్యక్తి మన దేశంలో అడుగుపెట్టి, వారి కుటుంబం మొత్తాన్ని అమెరికా పౌరులుగా మార్చడానికి కాదు. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసులో ఓడిపోతే అది దేశానికి వినాశకరం అవుతుంది" అని ఆయన హెచ్చరించారు.

జనవరి 2025లో, అక్రమ వలసదారులు మరియు తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం గుర్తించడాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు ఫెడరల్ కోర్టులు స్టే విధించడంతో, ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. డిసెంబర్ 5న ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, వచ్చే వేసవిలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం, దేశ సరిహద్దుల్లో పుట్టిన వారికి పౌరసత్వం లభిస్తుంది. అయితే, ఆ తల్లిదండ్రులు 'అమెరికా అధికార పరిధికి లోబడి' ఉండాలన్న నిబంధనపైనే ప్రస్తుతం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Donald Trump
Birthright citizenship
US citizenship
Immigration
14th Amendment
Supreme Court
Illegal immigrants
Executive order
Political news
United States

More Telugu News