Donald Trump: రూటు మార్చిన ట్రంప్.. అమెరికన్ల ఓట్ల కోసం కొత్త నినాదం

Donald Trump shifts focus to American voters
  • అంతర్జాతీయ అంశాల నుంచి దేశీయ సమస్యలపైకి ట్రంప్ దృష్టి
  • పెన్సిల్వేనియాలో 'తక్కువ ధరలు, ఎక్కువ జీతాలు' నినాదంతో ర్యాలీ
  • పెరుగుతున్న ధరల భారం, ఓటర్ల ఆందోళనే ప్రధాన కారణం
  • వచ్చే ఏడాది ప్రతినిధుల సభ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహంలో మార్పు
  • పలు సర్వేలలో ప్రజాదరణ తగ్గడంతో దిద్దుబాటు చర్యలు
అంతర్జాతీయంగా తీవ్రమైన టారిఫ్ యుద్ధాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సొంత దేశ ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. అమెరికాలో అధిక ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం ఓటర్లను తీవ్రంగా వేధిస్తుండటంతో, ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు. మంగళవారం కీలకమైన స్వింగ్ స్టేట్ అయిన పెన్సిల్వేనియాలో 'తక్కువ ధరలు, ఎక్కువ జీతాలు' అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ... ధరల తగ్గింపుపై కొత్త హామీలు ఇవ్వకుండా తన హయాంలో పెట్రోల్ ధరలు తగ్గాయని, ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు వచ్చాయని, ఉద్యోగాలు సృష్టించామని పాత విషయాలనే మళ్ళీ ప్రస్తావించారు. తన ప్రసంగంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను, డెమొక్రాట్లను తీవ్రంగా విమర్శించారు. అయితే, కొన్ని రోజుల క్రితం 'అఫర్డబిలిటీ' (అందుబాటు ధరలు) అనేది డెమొక్రాట్ల కుంభకోణం అని వ్యాఖ్యానించిన ట్రంప్, ఇప్పుడు 'అమెరికాను మళ్లీ చౌకగా మారుద్దాం' అని నినదించడం గమనార్హం.

వచ్చే ఏడాది ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవలి కొన్ని ఎన్నికల్లో 'అఫర్డబిలిటీ' నినాదంతో డెమొక్రాట్లు పుంజుకోవడం, పలు సర్వేలలో ట్రంప్ పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటం ఈ మార్పుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. హౌస్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో, ప్రజల ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టకపోతే నష్టం తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ట్రంప్ కొన్ని కొత్త హామీలు ఇచ్చారు. 'టారిఫ్ డివిడెండ్ చెక్' కింద చాలామంది అమెరికన్లకు 2,000 డాలర్లు చెల్లిస్తామని, కొత్తగా పుట్టిన పిల్లల కోసం 1,000 డాలర్లతో 'ట్రంప్ అకౌంట్' ప్రారంభిస్తామని ప్రకటించారు. టారిఫ్ యుద్ధం వల్ల నష్టపోయిన రైతులకు 12 బిలియన్ డాలర్లు పంపిణీ చేస్తామని తెలిపారు.  
Donald Trump
Trump rally
US elections
Pennsylvania
Affordability
Joe Biden
Tariff dividend check
Trump account
American economy

More Telugu News