Ahmed Sharif Chaudhry: ఇమ్రాన్‌ను 'పిచ్చోడు' అన్నారు.. జర్నలిస్టుకు కన్నుకొట్టారు.. పాక్ ఆర్మీ అధికారిపై తీవ్ర విమర్శలు

Pakistan Army Officer Ahmed Sharif Chaudhry Faces Backlash
  • మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను మానసిక రోగి అన్న పాక్ ఆర్మీ అధికారి
  • ప్రశ్న అడిగిన మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి వివాదంలో చిక్కుకున్న మేజర్ జనరల్
  • ఆ అధికారి తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
పాకిస్థాన్‌లో ఓ ఉన్నత సైన్యాధికారి ప్రవర్తన తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం (ISPR) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. ఓ మహిళా జర్నలిస్టుతో అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయనను 'మానసిక రోగి' అని వ్యాఖ్యానించి, ఆ తర్వాత ప్రశ్న అడిగిన మహిళా జర్నలిస్టు అబ్సా కోమన్‌కు కన్నుకొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఓ ప్రెస్ మీట్‌లో జర్నలిస్టు అబ్సా కోమన్.. "ఇమ్రాన్ ఖాన్‌ను దేశ భద్రతకు ముప్పుగా, దేశ వ్యతిరేకిగా, ఢిల్లీ చేతిలో పనిచేస్తున్న వ్యక్తిగా ఆరోపణలు చేస్తున్నారు. గతానికి, ఇప్పటికీ తేడా ఏంటి?" అని ప్రశ్నించారు. దీనికి చౌదరి బదులిస్తూ, "మీరు చెప్పిన మూడు పాయింట్లకు నాలుగోది కూడా చేర్చండి.. ఆయన ఒక 'జెహ్నీ మరీజ్' (మానసిక రోగి) కూడా" అంటూ నవ్వి, ఆమె వైపు చూసి కన్నుగీటారు.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. "కెమెరాల ముందే ఇలా జరుగుతోందంటే.. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది" అని ఒకరు వ్యాఖ్యానించగా, "దేశం ఒక మీమ్‌గా మారిపోయింది" అని మరొకరు విమర్శించారు.

ఇటీవల కూడా చౌదరి, ఇమ్రాన్ ఖాన్ పేరు చెప్పకుండా ఆయనొక స్వయం మోహితుడు లాంటి వ్యక్తి అని, "నేను అధికారంలో లేకపోతే ఇంకేదీ ఉండకూడదు" అని నమ్మే రకమని ఆరోపించారు. జైలులో ఇమ్రాన్‌ను కలిసే వ్యక్తుల ద్వారా సైన్యానికి వ్యతిరేకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2023 మే 9న సైనిక స్థావరాలపై జరిగిన దాడుల వెనుక ఇమ్రాన్ హస్తం ఉందని ఆయన మరోసారి ఆరోపించారు. అయితే, ఆ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ గతంలోనే ఖండించారు.
Ahmed Sharif Chaudhry
Imran Khan
Pakistan Army
ISPR
Absa Komal
Pakistan Politics
Military Official Controversy
Journalist
Social Media
Political Criticism

More Telugu News