మార్చి 14 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల గ్యాప్

  • 2026 మార్చి 14 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
  • ఏడు పేపర్లకు నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణ
  • షెడ్యూల్‌పై టీచర్ల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు
  • సీబీఎస్ఈ విధానంలోనే సెలవులు ఇచ్చామంటున్న అధికారులు
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం, 2026 మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 16న ముగియనున్నాయి. ఈసారి ఏడు పేపర్లకు జరిగే పరీక్షలను దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనుండటం గమనార్హం. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఈసారి ప్రభుత్వం ప్రతి పరీక్షకు మధ్య మూడు నుంచి ఐదు రోజుల పాటు సెలవులు కేటాయించింది. హిందీకి మూడు రోజులు, ఇంగ్లిష్, గణితం, సైన్స్ సబ్జెక్టులకు నాలుగు రోజులు, సోషల్ స్టడీస్‌కు ఐదు రోజుల విరామం ఇచ్చారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలకు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గంటన్నర సమయం కేటాయించారు.

అయితే, ఈ షెడ్యూల్‌పై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల్లో ముగియవల్సిన పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సిద్ధం చేస్తే, పరీక్షల మధ్య ఈ సుదీర్ఘ విరామం వల్ల వారు చదివింది మర్చిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి బదులు మరింత పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.

దీనిపై అధికారుల వాదన మరోలా ఉంది. సీబీఎస్ఈ పరీక్షల విధానంలో కూడా పేపర్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుందని, అదే తరహాలో తాము కూడా సెలవులు ఇచ్చామని చెబుతున్నారు. అంతేకాకుండా, పరీక్షల సమయంలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి పండుగలు, సెలవులు రావడం వల్లే విరామం పెరిగిందని అధికారులు వివరించారు.


More Telugu News