తిరుపతి సంస్కృత వర్సిటీలో విద్యార్థినిపై అఘాయిత్యం.. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్ట్

  • లైంగిక దాడిని వీడియో తీసి బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసిన నిందితులు
  • వర్సిటీ అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
  • ఒడిశా వెళ్లి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌తో పాటు అతనికి సహకరించిన మరో ప్రొఫెసర్ డాక్టర్ ఎ.శేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... ఒడిశాకు చెందిన 27 ఏళ్ల యువతి ఈ విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెపై కన్నేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, ఆమెను ప్రలోభపెట్టి తన కార్యాలయంలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి ఈ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ బాధితురాలిని నిందితులిద్దరూ లైంగికంగా వేధించారు.

వారి వేధింపులు భరించలేకపోయిన విద్యార్థిని, విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసి తన సొంత ఊరికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వర్సిటీ యాజమాన్యం, అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసి లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అనంతరం వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా తిరుపతి పడమర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ మురళీమోహన్ నేతృత్వంలోని బృందం ఒడిశా వెళ్లి బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


More Telugu News