Rajendra Singh: మూసీ ప్రాజెక్ట్ ఓ అద్భుతం: వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్ ప్రశంసలు

Rajendra Singh Praises Moosi River Revival Project A Marvel
  • పూర్తయితే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్న రాజేంద్ర సింగ్
  • సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటానని ప్రకటన
  • లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరం అంటూ వ్యాఖ్య
  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మూసీ పునర్జీవ ప్రాజెక్టు'పై ప్రముఖ జల సంరక్షణ నిపుణుడు, 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన డాక్టర్ రాజేంద్ర సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలతో పూర్తయితే ప్రపంచానికే తలమానికంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లో ఎండిపోయిన 23 నదులకు పునర్జీవం పోసిన రాజేంద్ర సింగ్ ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో హైదరాబాద్‌కు స్వచ్ఛమైన తాగునీరు అందించిన మూసీకి మళ్లీ జీవం పోయాలన్న ఆలోచన ఎంతో గొప్పదని రాజేంద్రసింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టిన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రాజెక్టు విజయవంతమైతే, హైదరాబాద్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఎదుగుతుందని, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మూసీని చూసేందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు అమలులో తన పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంపై రాజేంద్రసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరమని, అందులో సగం నిధులను చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు కేటాయించి ఉంటే తెలంగాణ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జల సంరక్షణ మెరుగ్గా ఉందని, కాకతీయుల నాటి చెరువులు ఇప్పటికీ సజీవంగా ఉండటం గొప్ప విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు ప్రతి పౌరుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామి కావాలని రాజేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.
Rajendra Singh
Moosi River
Telangana
Revanth Reddy
Water Conservation
Kaleshwaram Project
River Restoration
Hyderabad Tourism
Waterman of India
Kakatiya Tanks

More Telugu News