H-1B Visa: భారతీయ టెక్కీలకు కొత్త కష్టాలు.. హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా

H1B Visa Indian Applicants Face Delays Due to Social Media Checks
  • సోషల్ మీడియా తనిఖీల కారణంగానే ఈ నిర్ణయం
  • డిసెంబర్ ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చికి మార్పు
  • పాత తేదీల్లో రావొద్దని దరఖాస్తుదారులకు రాయబార కార్యాలయం సూచన 
అమెరికా వెళ్లాలనుకునే భారతీయ హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు ఊహించని అడ్డంకి ఎదురైంది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా తనిఖీల విధానం కారణంగా, భారత్‌లో అనేక వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మార్పులపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి దరఖాస్తుదారులకు కీలక సూచనలు జారీ చేసింది.

వీసా అపాయింట్‌మెంట్ తేదీ మార్చబడినట్లు మీకు ఈమెయిల్ వచ్చి ఉంటే, కొత్త తేదీలో మాత్రమే హాజరు కావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పాత తేదీలో ఇంటర్వ్యూ కోసం వస్తే, వారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని హెచ్చరించింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు జరగాల్సిన అనేక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చి నెలకు మార్చబడ్డాయి.

కొత్త నిబంధనల ప్రకారం హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్రైవసీ సెట్టింగులను 'పబ్లిక్'గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల‌ 15 నుంచి అధికారులు వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను సమీక్షించి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తిస్తారు. "ప్రతి వీసా మంజూరు ప్రక్రియ ఒక జాతీయ భద్రతా నిర్ణయం" అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై నిఘా పెరిగింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు ప్రాథమిక మార్గమైన ఈ వీసాపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించారు. గతంలో హెచ్-1బీ వీసాలపై 100,000 డాల‌ర్ల రుసుము విధించడం, 19 దేశాల నుంచి గ్రీన్ కార్డ్ దరఖాస్తులను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
H-1B Visa
Indian Techies
US Visa Appointments
Social Media Checks
US Embassy India
Visa Delays
H-4 Visa
Trump Administration
Green Card
Visa Restrictions

More Telugu News