Kavitha: హరీశ్‌ను బయటకు, కేటీఆర్‌ను జైలుకు పంపే ప్లాన్.. కవితపై మాధవరం సంచలన ఆరోపణలు

Kavitha Plans to Jail KTR Remove Harish Rao Alleges Madhavaram
  • రేవంత్‌రెడ్డితో కలిసి కవిత కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్యే
  • బతుకమ్మ పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపణ
  • రూ.1000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారన్న కృష్ణారావు
  • మరోసారి మాట్లాడితే చిట్టా విప్పుతానంటూ తీవ్ర హెచ్చరిక
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేయించేందుకు, సీనియర్ నేత హరీశ్‌రావును పార్టీ నుంచి బయటకు పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌లో సర్వం తానే కావాలనే దురుద్దేశంతో ఆమె ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

సోమవారం తనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన విమర్శలపై మాధవరం కృష్ణారావు మంగళవారం మీడియా సమావేశంలో స్పందించారు. "ఢిల్లీలో కేజ్రీవాల్‌ను నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, బీఆర్ఎస్‌ను నాశనం చేయాలని చూస్తున్నావు" అని కవితపై విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు దోచుకున్నారని, రూ.1000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

బాలానగర్‌ ఐడీపీఎల్‌లోని సర్వే నంబర్ 21, 22లో 36 ఎకరాల భూమి ఆమె భర్త పేరిట ఎలా వచ్చిందో చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. బతుకమ్మ పేరుతో కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు హైదరాబాద్‌లో కవితకు ఉందని అన్నారు.

బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటని, తనపై మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆమె పూర్తి చిట్టా విప్పుతానని కృష్ణారావు హెచ్చరించారు. "నీలాంటి కుక్కలు చాలా మొరుగుతుంటాయి. నీ వల్ల ఎంతమంది బలయ్యారో బయటపెడతా" అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
Kavitha
Kalvakuntla Kavitha
KTR
Harish Rao
Revanth Reddy
BRS Party
Telangana Politics
Corruption Allegations
Madhvaram Krishna Rao
Land Scam

More Telugu News