సుచిత్రలో భారీ బందోబస్తు మధ్య భూ సర్వే.. మల్లారెడ్డి అనుచరుల ఆందోళన

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు
  • మేడ్చల్ జిల్లా సుచిత్రలో వివాదాస్పద భూమి సర్వే
  • భారీ పోలీసు బందోబస్తు మధ్య నెలకొన్న ఉద్రిక్తత
  • కోర్టు తీర్పు తమకే అనుకూలమంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లోని వివాదాస్పద భూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితుల ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు నిన్న భూమి సర్వే చేపట్టగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సుచిత్రలోని సర్వే నంబర్ 82, 83లో ఉన్న 1.29 ఎకరాల స్థలంలో తమకు చెందిన 33 గుంటల భూమిని మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారని శ్రీనివాస్ రెడ్డి అనే బాధితుడు ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈ కబ్జా జరిగిందని, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు మంగళవారం అధికారికంగా ల్యాండ్ సర్వే ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, సర్వే జరుగుతున్న ప్రాంతంలోకి వారిని పోలీసులు అనుమతించలేదు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని చెదరగొట్టడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మరోవైపు, ఈ భూ వివాదంపై కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మాజీ మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. అయినప్పటికీ, తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరువర్గాల వాదనల మధ్య, భారీ పోలీసు భద్రత నడుమ సర్వే కొనసాగింది. 


More Telugu News