Chandrababu Naidu: నేడు మంత్రులు, ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక భేటీ

AP CM Chandrababu Naidu to Hold Key Meeting with Ministers and Officials
  • రాబోయే నాలుగు నెలల వృద్ధిరేటుపై ప్రధానంగా చర్చ
  • సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజా సంతృప్తిపై సమీక్ష
  • గత ప్రభుత్వ అప్పులు, రీస్ట్రక్చరింగ్‌పై శాఖల వారీగా ఆరా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో (హెచ్‌ఓడీలు) ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఈ రోజు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలన, ఆర్థిక వృద్ధిరేటుపై ప్రధానంగా చర్చిస్తారు.

రానున్న నాలుగు నెలల్లో రాష్ట్ర వృద్ధిరేటును పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఫలితాలను సమీక్షిస్తూ, మిగిలిన రెండు త్రైమాసికాల్లో నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలపై చర్చిస్తారు. జీఎస్‌డీపీ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ), డేటా ఆధారిత పాలన వంటి అంశాలపై సమావేశంలో లోతుగా విశ్లేషించనున్నారు.

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘సూపర్ సిక్స్’ పథకాల అమలు తీరు, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచడంపై కూడా దృష్టి సారించనున్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యాన్ని నివారించడం, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికల పనితీరు, ఐటీ అప్లికేషన్ల వినియోగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా హెచ్‌ఓడీలకు ముఖ్యమంత్రి సూచించనున్నారు.

అదేవిధంగా, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, రాష్ట్రంలోని ఇతర సంక్షేమ పథకాల ఫలితాలపై సమీక్షిస్తారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, వాటి పునర్‌వ్యవస్థీకరణ (రీస్ట్రక్చరింగ్) అంశంపై కూడా శాఖల వారీగా ఆరా తీయనున్నట్లు సమాచారం. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
AP Growth Rate
Super Six Schemes
GSDP
KPI
Data Driven Governance
AP Secretariat Meeting
Welfare Schemes

More Telugu News