Anand Mahindra: రేవంత్ రెడ్డి లక్ష్యాలు విన్నాక ఛైర్మన్ పదవిని తిరస్కరించలేకపోయా: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Accepted Chairman Post After Hearing Revanth Reddy Goals
  • స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉండాలని రేవంత్ రెడ్డి కోరితే మొదట కుదరదని చెప్పానని వెల్లడి
  • ఆయన విజన్ విన్నాక విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయానన్న ఆనంద్ మహీంద్రా
  • తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ ప్రజలు కేంద్రంగా రూపొందించారన్న మహీంద్రా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాలు, విజన్‌ను విన్న తర్వాత స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉండాలనే ఆయన విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయానని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో అన్ని సెషన్లు ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, సినీ నటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్‌ను రూపొందించారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు ఆయన అభినందనలు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి తనను అడిగారని గుర్తు చేసుకున్నారు. అప్పటికే టెక్ మహీంద్రా యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉన్నందున కుదరదని చెప్పానని, కానీ ఆయన విజన్ విన్నాక అంగీకరించినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశానని, ప్రజలనే కేంద్రంగా చేసుకుని దీనిని రూపొందించారని ఆయన ప్రశంసించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలకు ఇప్పుడు గమ్యస్థానంగా ఉందని, నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందని అన్నారు.

దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సుబ్బారావు వెల్లడించారు. ప్రతి సంవత్సరం 8-9 శాతం వృద్ధి సాధిస్తే తెలంగాణ తన లక్ష్యాలను అందుకోగలదని అన్నారు. చైనా గ్వాంగ్‌డాంగ్ నమూనాను తెలంగాణ ప్రభుత్వం ఎంచుకుందని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ మాత్రమే కాదని, అన్‌బీటబుల్ కూడా అని పేర్కొన్నారు.
Anand Mahindra
Revanth Reddy
Telangana Rising Global Summit
Telangana
Skill University
Telangana Vision 2047

More Telugu News