YS Sharmila: నెహ్రూ అసలైన విశ్వాస పాత్రుడైతే... సిసలైన విశ్వాస ఘాతకుడు మోదీనే: షర్మిల

YS Sharmila Slams Modi Calls Him Traitor
  • నెహ్రూపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన షర్మిల
  • మోదీ ఓ అభినవ బ్రిటీషర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పూర్వీకుల పాత్రేమిటని ప్రశ్న
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మోదీ మాటలున్నాయని ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని, సమరయోధులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాసపాత్రుడైతే, మోదీ సిసలైన విశ్వాస ఘాతకుడని ఘాటుగా విమర్శించారు.

స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైలు జీవితం గడిపిన నెహ్రూను, అదే స్వాతంత్ర్య ఫలాలతో 12 ఏళ్లుగా అధికారంలో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్న మోదీ విమర్శించడం సిగ్గుచేటని షర్మిల అన్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా మోదీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేతల పాత్రను ఆమె ప్రశ్నించారు. "స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత తరం నేతలు ఎక్కడున్నారు? మత ఛాందసవాదులు ఎప్పుడైనా 'వందేమాతరం' అన్నారా? ఆర్ఎస్ఎస్ జాతీయ పతాకానికి సెల్యూట్ చేసిందా? 2002 వరకు ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై జాతీయ జెండా ఎందుకు ఎగరలేదు?" అని షర్మిల నిలదీశారు.

వివిధ వ్యవస్థలపై బీజేపీ అజమాయిషీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నెహ్రూను దోషిగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 'విభజించు - పాలించు' సిద్ధాంతంతో మోదీ ఓ అభినవ బ్రిటీషర్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జాతీయ గీతాన్ని, వందేమాతరం స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు.
YS Sharmila
Narendra Modi
Jawaharlal Nehru
Indian National Congress
BJP
RSS
India Politics
Political criticism
Freedom movement
Vande Mataram

More Telugu News