Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య

Australia Bans Social Media for Children to Restore Childhood says PM Anthony Albanese
  • ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
  • బుధవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
  • నిషేధం అమలు బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా కంపెనీలదే
ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించింది. ఈ కొత్త, కఠిన నిబంధనలు బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణ ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడచ్చని, తల్లిదండ్రులకు మరింత భరోసా ఇవ్వవచ్చని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

2024 నవంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల ప్రకారం, 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ చట్టంలోని కీలక అంశం ఏమిటంటే, నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా సంస్థలదే. ఒకవేళ పిల్లలు నిబంధనలు ఉల్లంఘించినా, వారికి గానీ వారి తల్లిదండ్రులకు గానీ ఎలాంటి శిక్షలు ఉండవు. ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం, ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ఆస్ట్రేలియా రాష్ట్రాల అధినేతలకు ప్రధాని అల్బనీస్ ఈరోజు లేఖ రాశారు. "ఆస్ట్రేలియాకు అవసరమైన సాంస్కృతిక మార్పు ఇదే" అని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.

సోషల్ మీడియాలోని కొన్ని డిజైన్లు యువతను స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా ప్రోత్సహిస్తున్నాయని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025లో ప్రభుత్వం జరిపిన ఒక అధ్యయనంలో, 10-15 ఏళ్ల వయసున్న పిల్లల్లో 96 శాతం మంది సోషల్ మీడియా వాడుతున్నారని, వారిలో 70 శాతం మంది హింస, ఆత్మహత్యలను ప్రోత్సహించే కంటెంట్ వంటి హానికరమైన విషయాలను చూస్తున్నారని తేలింది. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడమే ఈ నిషేధం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం వివరించింది.
Anthony Albanese
Australia
social media ban
children
teenagers
internet safety
digital wellbeing
online platforms
parental control
youth protection

More Telugu News