Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే!

Jasprit Bumrah set to become first Indian bowler with 100 plus wickets in all formats
  • దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
  • టీ20ల్లో 100 వికెట్ల మైలురాయికి చేరువలో జస్ప్రీత్ బుమ్రా
  • ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచే అవకాశం
  • మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా రికార్డు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఈ రాత్రి జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. మరో వికెట్ పడగొడితే టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ప్రస్తుతం బుమ్రా 80 టీ20 మ్యాచ్‌లలో 99 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 68 మ్యాచ్‌లలో 105 వికెట్లతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (182) అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా, ఈ టీ20 సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చాడు.

తొలి భారత బౌలర్‌గా మరో అరుదైన మైలురాయి 
ఈ ఒక్క వికెట్‌తో బుమ్రా మరో అరుదైన మైలురాయిని కూడా అందుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 100కు పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలుస్తాడు. బుమ్రా ఇప్పటివరకు 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది, లసిత్ మలింగ మాత్రమే ఈ ఘనత సాధించారు.

భారత్ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలుచుకోగా, మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఇప్పుడు ఇరు జట్లు టీ20 సిరీస్‌పై దృష్టి సారించాయి.
Jasprit Bumrah
India vs South Africa
T20 series
Jasprit Bumrah wickets
Indian bowler record
T20 international
Arshdeep Singh
Rashid Khan
Cricket record
Bumrah milestone

More Telugu News