CH Raju: ఎన్నికల టెన్షన్: ఓటమి భయంతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

Telangana Elections Sarpanch Candidate Suicide in Sangareddy
  • పంచాయతీ ఎన్నికల వేళ విషాదాలు
  • ఓటమి భయంతో సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
  • ప్రచారం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన మహిళా వార్డు సభ్యురాలు
  • నిద్రలోనే గుండెపోటుతో మరో వార్డు అభ్యర్థి కన్నుమూత
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బాండ్ పేపర్‌తో ప్రచారం చేస్తున్న అభ్యర్థిపై కేసు
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఒత్తిడితో కూడిన వాతావరణంలో సాగుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో ఓ అభ్యర్థిపై కేసు నమోదైంది.

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సీహెచ్ రాజు (36) ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే ఆందోళనతో, నమ్మినవాళ్లే ప్రచారానికి రావడం లేదన్న మనోవేదనతో ఆయన చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఆదివారం రాత్రి తోటి అయ్యప్ప స్వాములతో తన ఆవేదన పంచుకోగా, వారు ధైర్యం చెప్పినప్పటికీ సోమవారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మంచర్లగూడలో 8వ వార్డుకు పోటీ చేస్తున్న పల్లె లత (42) ప్రచారం నిర్వహిస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

అలాగే, సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం చక్రియాల గ్రామంలో 8వ వార్డు అభ్యర్థి కొత్తొల్ల పద్మారావు (50) ఆదివారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణంతో ఆ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య రెండుకు చేరిందని, ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేదని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లిలో సర్పంచ్ అభ్యర్థి చల్ల కమలాకర్‌ రెడ్డి బాండ్ పేపర్‌పై హామీలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
CH Raju
Telangana Panchayat Elections
Sarpanch Election
Sangareddy District
Suicide
Election Stress
Palle Latha
Heart Attack
Vangapalli
Challa Kamalakar Reddy

More Telugu News