Nara Lokesh: ఏపీకి పెట్టుబడులే లక్ష్యం... అమెరికాలో మంత్రి లోకేశ్ వరుస భేటీలు

Nara Lokesh Focuses on Investments for AP in USA
  • అమెరికా పర్యటనలో టెక్ దిగ్గజాలతో మంత్రి లోకేశ్ సమావేశం
  • విశాఖలో సెంటర్లు ఏర్పాటు చేయాలని జడ్‌స్కేలర్, సేల్స్‌ఫోర్స్‌కు విజ్ఞప్తి
  • అమరావతిలో క్వాంటమ్, క్రియేటివ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కోరిన మంత్రి
  • గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులకు ఓమియం సంస్థకు ఆహ్వానం
  • ప్రతిపాదనలు పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన కంపెనీలు
ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో పలు ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విశాఖ, అమరావతి కేంద్రంగా ఐటీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.

శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జడ్‌స్కేలర్ సీఈవో జే చౌదరి, ప్రముఖ క్లౌడ్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో లోకేశ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. "డేటా సిటీ"గా అభివృద్ధి చెందుతున్న విశాఖకు గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు వస్తున్నాయని, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కోసం ఆర్ అండ్ డి, డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జడ్‌స్కేలర్‌ను కోరారు. అలాగే, విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని సేల్స్‌ఫోర్స్‌ను ఆహ్వానించారు.

రాజధాని అమరావతిలో రాబోతున్న "క్వాంటమ్ వ్యాలీ"లో పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని రిగెట్టి కంప్యూటింగ్ సీటీవో డేవిడ్ రివాస్‌ను లోకేశ్ కోరారు. మరోవైపు, అమరావతిలో ఎంటర్‌టైన్‌మెంట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేస్తున్న "క్రియేటర్ ల్యాండ్" ప్రాజెక్టులో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని డిజైన్ ప్లాట్‌ఫామ్ సంస్థ కాన్వా ప్రతినిధులను కోరారు. వీటితో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏపీలోని పారిశ్రామిక జోన్‌లో ఏర్పాటు చేయాలని ఓమియం సంస్థ సీఎస్‌టీవో చొక్కలింగం కరుప్పయ్యకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశాల్లో ఆయా సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. భారత్‌లో తమ కార్యకలాపాలను వివరిస్తూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ యాజమాన్య బృందాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రికి తెలిపారు.
Nara Lokesh
Andhra Pradesh
AP Investments
IT Sector
Green Energy
Quantum Computing
Visakhapatnam
Amaravati
Cloud Security
Salesforce

More Telugu News