Donald Trump: అమెరికా మార్కెట్‌లో భారత్ బియ్యం.. సుంకాలతో చెక్ పెడతామన్న ట్రంప్

Donald Trump Threatens Tariffs on Indian Rice in US Market
  • భారత్ నుంచి బియ్యం దిగుమతులపై సుంకాల హెచ్చరిక
  • కెనడా ఎరువులపైనా కఠిన సుంకాలు విధిస్తామన్న ట్రంప్
  • అమెరికా రైతులకు 12 బిలియన్ డాల‌ర్ల‌ ఆర్థిక ప్యాకేజీ ప్రకటన
  • దిగుమతుల వల్ల స్థానిక రైతులకు నష్టం కలుగుతోందని ఆరోపణ
  • సుంకాలతో రెండు నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తానన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి సంకేతాలు పంపారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యం, కెనడా నుంచి వస్తున్న ఎరువులపై కొత్తగా సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వైట్‌హౌస్‌లో అమెరికా రైతులకు 12 బిలియన్ డాల‌ర్ల‌ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్, కెనడాలతో వాణిజ్య చర్చల్లో ఆశించిన పురోగతి లేకపోవడంతో ట్రంప్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ బియ్యం దిగుమతుల వల్ల అమెరికాలోని స్థానిక రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో ఒక రైతు మాట్లాడుతూ.. అమెరికా రిటైల్ మార్కెట్లో రెండు అతిపెద్ద రైస్ బ్రాండ్లు భారత్ కంపెనీలవేనని చెప్పగా, ట్రంప్ వెంటనే స్పందించారు. "సరే, దాని సంగతి మేం చూస్తాం. సుంకాలు విధిస్తే రెండు నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుంది" అని ఆయన అన్నారు. భారత్ కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో డంపింగ్ చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే కెనడా నుంచి వస్తున్న ఎరువులపైనా కఠిన సుంకాలు విధించి స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని ట్రంప్ తెలిపారు. అమెరికా రైతులను దేశానికి వెన్నెముకగా అభివర్ణించిన ఆయన, వారిని ఆదుకునేందుకే 12 బిలియన్ డాల‌ర్ల‌ ప్యాకేజీని ప్రకటించారు. ఈ నిధులను ఇతర దేశాలపై విధించిన సుంకాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే సమకూరుస్తున్నట్లు తెలిపారు.

గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం గణనీయంగా పెరిగింది. భారత్ నుంచి బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అవుతుండగా, అమెరికా నుంచి బాదం, పత్తి వంటివి దిగుమతి అవుతున్నాయి. అయితే సబ్సిడీలు, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వేదికగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Donald Trump
Indian rice
US market
tariffs
trade war
agriculture
US farmers
India-US trade
rice exports
import duties

More Telugu News