Bethlehem: విషాదం నీడలో వెలుగులు... రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

Bethlehem Christmas Tree Lights Up After 2 Years Amidst Gaza Conflict
  • ఆనందం, ఆవేదనల మధ్య బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
  • గాజాలో జరుగుతున్న విధ్వంసం కారణంగా నిరాడంబరంగా వేడుకలు
  • ఇజ్రాయెల్ ఆంక్షలతో కుదేలైన పర్యాటక రంగం, స్థానిక ఆర్థిక వ్యవస్థ
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసం మధ్య, ఏసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహేంలో రెండేళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మింది. ఈ సంబరాలు పాలస్తీనియన్లలో ఒకేసారి ఆశను, ఆవేదనను నింపుతున్నాయి. 

ఈసారి క్రిస్మస్ వేడుకలను కేవలం మతపరమైన ప్రార్థనలు, సంప్రదాయాలకే పరిమితం చేశారు. మాంగర్ స్క్వేర్‌లో స్థానిక అధికారులు, చర్చి పెద్దల సమక్షంలో నిరాడంబరంగా క్రిస్మస్ ట్రీని వెలిగించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్రార్థన గీతాలు ఆలపించారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం, మరణాల కారణంగా వేడుకల్లో ఆనందం కన్నా విషాదమే ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

"ఈ వేడుకలు మునుపటిలా లేవు. మా హృదయాల్లో గాజా విషాదం నిండి ఉంది. అయినా, ఈ కష్టకాలంలోనూ మేం జీవించాలని ఆశిస్తున్నాం. బెత్లెహేం క్రిస్మస్ రాజధానిగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నాం" అని ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ఫాదర్ ముంథర్ ఐజాక్ తెలిపారు.

బెత్లెహేం మేయర్ మహేర్ ఎన్ కనవతి మాట్లాడుతూ, "చీకటిని పారదోలి ప్రజల్లో ఆశను నింపేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. పోప్ లియో-14 కూడా బెత్లెహేం ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు సందేశం పంపారు" అని అన్నారు.

ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా బెత్లెహేంలో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆదాయం లేకపోయినా, రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్న ఆశతోనే వ్యాపారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని పాలస్తీనియన్లను బస్సుల్లో ఇక్కడికి రప్పించి స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బెత్లెహేం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ విదేశీ పర్యాటకుల రాక లేకపోవడంతో హోటళ్లలో ఆక్యుపెన్సీ కేవలం 20 శాతంగానే ఉంది.
Bethlehem
Christmas Tree Bethlehem
Israel Gaza War
Palestine
Christmas Celebrations
Manger Square
Palestinian Tourism
Bethlehem Chamber of Commerce
Father Munther Isaac

More Telugu News