JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ భారీ షాక్..!

ICC Faces Shock as JioHotstar Withdraws from Media Rights
  • ఐసీసీ ఒప్పందం నుంచి వైదొలగిన జియోహాట్‌స్టార్!
  • 2026 టీ20 ప్రపంచకప్ ప్రసార బాధ్యతల నుంచి తప్పుకున్న వైనం
  • భారీ ఆర్థిక నష్టాలే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడి
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ అధికారిక ప్రసారకర్తగా ఉన్న 'జియోహాట్‌స్టార్' తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. భారీ ఆర్థిక నష్టాల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీకి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం.

2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే, అంతకుముందే జియోహాట్‌స్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ఈ టోర్నీకి మాత్రమే కాకుండా, 2024-27 మధ్య కాలానికి కుదుర్చుకున్న 3 బిలియన్ డాలర్ల మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కూడా కొనసాగించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

జియోహాట్‌స్టార్ నిర్ణయంతో అప్రమత్తమైన ఐసీసీ, వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. 2026-29 కాలానికి గాను 2.4 బిలియన్ డాలర్లతో కొత్తగా మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ప్రారంభించింది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలను ఐసీసీ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి.

అయితే, ఒప్పందం విలువ చాలా ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదని సమాచారం. దీంతో 2026 టీ20 ప్రపంచకప్ ప్రసార హక్కులపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. 
JioHotstar
ICC
T20 World Cup
Media Rights
Cricket
India
Sri Lanka
Sony Pictures Network India
Netflix
Amazon Prime Video

More Telugu News