Jagan Mohan Reddy: దొంగతనం చేసిన వ్యక్తే పశ్చాత్తాపం చెందుతుంటే... జగన్ ఇంకా వెనకేసుకొస్తున్నారు: మంత్రి మండిపల్లి

Mandipalli Criticizes Jagan on Parakamani Theft Case
  • పరకామణి దొంగతనం కేసులో జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • పరకామణి దొంగను జగన్ వెనకేస్తున్నారంటూ విమర్శలు
  • గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం జగన్ వెనకేస్తున్నారని ఆరోపణ
తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడుతుంటే, దానిని మాజీ సీఎం జగన్ ‘చిన్న తప్పు’గా అభివర్ణించి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సీఐ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.

గతంలో చేసిన పాపాలే నేడు వైసీపీని వెంటాడుతున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు జగన్ ఆపసోపాలు పడుతున్నారని రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. జీవితాంతం సీఎంగా ఉంటానని, తన ఫొటో ఇంట్లో పెట్టుకోమని చెప్పిన జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం

జగన్ హయాంలో పదేళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గంజాయి, డ్రగ్స్‌కు బానిసలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన గంజాయి సరఫరాదారు పులగం కొండారెడ్డిని సైతం జగన్ సమర్థించడం దారుణమన్నారు. 

"ఇంజినీరింగ్ విద్యార్థులకు, చిన్న పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్లు కూడా జగన్ దృష్టిలో అమాయకులేనా? సొంత బాబాయ్‌ని చంపిన వారిని వెనకేసుకొచ్చిన చరిత్ర ఆయనది" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ‘ఈగల్’ (EAGLE) అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని, రౌడీషీటర్లు, డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. లిక్కర్ స్కాంలో జగన్ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన, ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి లాంటి వారు అరెస్టయ్యారని, ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

‘బ్రాండ్ సీబీఎన్’తో దూసుకెళుతున్న రాష్ట్రం

జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని పరిశ్రమలు పారిపోయాయని, నేడు ‘బ్రాండ్ సీబీఎన్’ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ల కృషితో రాష్ట్రం 2047 విజన్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సదస్సే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

"కడప స్టీల్ ప్లాంట్ కలను సాకారం చేస్తున్నాం. కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నాం. ఓర్వకల్లు సెజ్‌లో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోంది. కొప్పర్తి సెజ్‌ను రూ.1000-1500 కోట్లతో ఆధునికీకరిస్తున్నాం. వైసీపీ నాశనం చేసిన బ్రాండ్ ఇమేజ్‌ను కూటమి ప్రభుత్వం తిరిగి నిలబెడుతోంది" అని వివరించారు. 

అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, పోలవరం పనులను 70 శాతం పూర్తి చేశామని తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ నాణ్యమైన యూనిఫాం, బ్యాగులు, భోజనం అందిస్తున్నామని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
Mandi Palli
Tirumala
Parakamani
CBN
Andhra Pradesh Politics
Corruption Allegations
Drug Mafia
Liquor Scam
YS Jagan

More Telugu News