Revanth Reddy: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు... బండి సంజయ్ రియాక్షన్

Bandi Sanjay Reacts to Revanth Reddys Trump Road Proposal
  • అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కన ఉన్న కీలక రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా నామకరణం 
  • హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బండి సంజయ్
  • ట్రెండింగ్ లో ఉన్న వారి పేర్లు పెడుతున్నారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని సంచలన ప్రతిపాదన చేశారు. త్వరలో జరగనున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్"కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కన ఉన్న కీలక రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా నామకరణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలను గౌరవించేందుకు ప్రభుత్వం మరికొన్ని పేర్లను కూడా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఓ ప్రధాన మార్గానికి 'గూగుల్ స్ట్రీట్' అని, మరికొన్నింటికి 'మైక్రోసాఫ్ట్ రోడ్', 'విప్రో జంక్షన్' అని పేర్లు పెట్టే యోచనలో ఉంది. ఇప్పటికే రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతున్న 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించగా, అక్కడి ఇంటర్‌ఛేంజ్‌కు 'టాటా ఇంటర్‌ఛేంజ్' అని నామకరణం చేశారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, సంస్థల పేర్లను రోడ్లకు పెట్టడం వల్ల వారికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో నగరానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పేర్లు మార్చాలనే ఆసక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, ముందుగా హైదరాబాద్ పేరును 'భాగ్యనగర్'గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. "ట్రెండింగ్‌లో ఉన్నవారి పేర్లను రేవంత్ రెడ్డి పెడుతున్నారు" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. నిజమైన ప్రజా సమస్యలపై మహాధర్నాతో పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ పేర్ల మార్పు ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Revanth Reddy
Telangana
Hyderabad
Donald Trump Avenue
Bandi Sanjay Kumar
Bhagyanagar
Google Street
Microsoft Road
Wipro Junction
Ratan Tata

More Telugu News