Shakib Al Hasan: రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టార్ ఆటగాడు

Shakib Al Hasan Wants Farewell Series in Bangladesh
  • రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్న షకీబ్ అల్ హసన్
  • మూడు ఫార్మాట్లలోనూ ఆడి వీడ్కోలు పలుకుతానని వెల్లడి
  • అభిమానులకు గౌరవంగా వీడ్కోలు చెప్పాలన్నదే తన కోరికని వ్యాఖ్య 
  • త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఆశాభావం
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన ఆయన, ఇప్పుడు మళ్లీ మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఒకేసారి పూర్తిస్థాయి సిరీస్ ఆడి, ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాలనేది తన ప్రణాళిక అని వెల్లడించాడు. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తన కథనంలో పేర్కొంది.

మొయిన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ పాడ్‌కాస్ట్‌లో షకీబ్ మాట్లాడుతూ.. "నేను అధికారికంగా ఏ ఫార్మాట్ నుంచీ రిటైర్ కాలేదు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి వన్డే, టెస్ట్, టీ20లతో కూడిన ఒక పూర్తి సిరీస్ ఆడి, ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాలనేది నా ప్లాన్. ఏ ఫార్మాట్ ముందు, ఏది తర్వాత అన్నది ముఖ్యం కాదు. కానీ, ఒక పూర్తి సిరీస్ ఆడి వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను" అని వివరించాడు.

కాగా, బంగ్లాదేశ్‌లో ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, 2024 మే నుంచి షకీబ్ దేశానికి దూరంగా ఉంటున్నాడు. ఆ పార్టీ తరఫున మాజీ ఎంపీగా ఉన్న షకీబ్ పేరు, ఓ హత్య కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్‌లో నమోదైంది. అయితే, ఆ సమయంలో ఆయన దేశంలో లేడు. ఆ తర్వాత పాకిస్థాన్, భారత్‌లలో టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

"త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని నమ్మకంతో ఉన్నాను. అందుకే టీ20 లీగ్స్ ఆడుతున్నాను. అభిమానులు నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. వారికి కృతజ్ఞతగా సొంతగడ్డపై ఒక సిరీస్ ఆడి గౌరవంగా వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను. ఆ సిరీస్‌లో నేను బాగా ఆడానా? లేదా? అన్నది ముఖ్యం కాదు. వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలన్నదే నా కోరిక" అని షకీబ్ పేర్కొన్నాడు.
Shakib Al Hasan
Bangladesh cricket
retirement
T20
Test cricket
all rounder
Bangladesh national team
cricket retirement
Moeen Ali
Awami League

More Telugu News