Rajasthan Government: శవ రాజకీయాలు చేస్తే ఐదేళ్ల జైలు.. రాజస్థాన్‌లో కొత్త చట్టం

Rajasthan New Law 5 Year Jail for Using Dead Bodies in Protests
  • కుటుంబ సభ్యులు శవాన్ని తిరస్కరించినా ఏడాది జైలు
  • 24 గంటల్లోగా అంత్యక్రియలు పూర్తి చేయాలన్న నిబంధన
  • అనాథ శవాల సమాచారం బయటపెడితే పదేళ్ల వరకు జైలు
  • గత ప్రభుత్వ చట్టానికి రూల్స్ నోటిఫై చేసిన ప్రస్తుత సర్కార్
రాజస్థాన్‌లో మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని నిరసనలు తెలిపే వారికి, శవ రాజకీయాలు చేసే వారికి ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ఎవరైనా మృతదేహంతో ఆందోళన చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గత అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'రాజస్థాన్ గౌరవ మృతదేహాల చట్టం' నిబంధనలను ప్రస్తుత భజన్ లాల్ శర్మ ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వీకరించాలి. ఒకవేళ వారు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మృతదేహాన్ని నిరసన కోసం వినియోగిస్తే లేదా ఇతరులకు అప్పగిస్తే కుటుంబ సభ్యులకు రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. కుటుంబేతరులు, రాజకీయ నాయకులు శవంతో నిరసన చేస్తే గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సాధారణంగా 24 గంటల్లోగా మృతుడికి అంత్యక్రియలు పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నా లేదా పోస్టుమార్టం అవసరమైన సందర్భంలో మాత్రమే అంత్యక్రియలను వాయిదా వేయడానికి అనుమతి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించకపోతే, పోలీసులే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2023 జులై 20న ఈ చట్టాన్ని ఆమోదించినప్పటికీ, నిబంధనలు రూపొందించకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేయడంతో ఈ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. అలాగే, అనాథ శవాల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, వాటికి డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ చేసి డిజిటల్ డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బయటపెట్టిన వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.
Rajasthan Government
Rajasthan
Dead Body Politics
Ashok Gehlot
Bhajan Lal Sharma
Rajasthan Honour of Dead Body Act
Mortal Remains
Protest
DNA Profiling
Digital Data Bank

More Telugu News