Justice Gavai: చీఫ్ జస్టిస్ కొడుక్కి.. కూలీ కొడుక్కి ఒకే న్యాయమా?: మాజీ సీజేఐ గవాయ్

Justice Gavai on Creamy Layer in SC ST Reservations Controversy
  • ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తింపజేయాలన్న మాజీ సీజేఐ గవాయ్
  • తన తీర్పుపై సొంత వర్గం నుంచే విమర్శలు ఎదుర్కొన్నానని వెల్లడి
  • సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి పదవులకు రిజర్వేషన్లు ఉండవని స్పష్టీకరణ
  • రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు చేరాలన్నదే తన ఉద్దేశమని వ్యాఖ్య
  • అదే అంబేద్కర్ అసలైన ఆశయమని అభిప్రాయం
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) కూడా క్రీమీలేయర్ విధానాన్ని వర్తింపజేయాలని తాను ఇచ్చిన తీర్పుపై సొంత వర్గం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రిజర్వేషన్ల ఫలాలు నిజంగా వెనుకబడిన వర్గాలకు చేరాలన్నదే తన ఉద్దేశమని ఆయన తన వైఖరిని గట్టిగా సమర్థించుకున్నారు.

"భారత ప్రధాన న్యాయమూర్తి కుమారుడికి, గ్రామ పంచాయతీ పాఠశాలలో చదివిన ఒక కూలీ కుమారుడికి ఒకే రకమైన కొలమానం వర్తింపజేయడం రాజ్యాంగం చెప్పిన సమానత్వం ఎలా అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ ప్రయోజనాలు పొంది సుప్రీంకోర్టు జడ్జి అయ్యాక, ఇప్పుడు ఇతరులకు ఆ ఫలాలు అందకుండా చేస్తున్నానని తనపై ఆరోపణలు చేశారని గవాయ్ గుర్తు చేసుకున్నారు.

అయితే, ఈ విమర్శలు రాజ్యాంగ నిబంధనలపై అవగాహన లేమితో చేస్తున్నారని ఆయన అన్నారు. "సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి రాజ్యాంగ పదవులకు రిజర్వేషన్లు ఉండవన్న ప్రాథమిక విషయం కూడా విమర్శించే వారికి తెలియదు. ఈ పదవులకు ఇతరులతో పోటీపడి మాత్రమే ఎంపిక కావాలి" అని ఆయన స్పష్టం చేశారు.

2024 ఆగస్టులో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీలలో క్రీమీలేయర్‌ను గుర్తించి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించాలని చారిత్రక తీర్పు ఇచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఈ తీర్పు ఉందని, వెనుకబడిన వారికి చేయూతనిచ్చి ముందుకు నడిపించాలన్నదే ఆయన ఉద్దేశం కానీ, ఆ చేయూతను ఎప్పటికీ వదలకూడదని కాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో, మధ్యవర్తిత్వం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్యులకు స్థానిక భాషల్లో అందుబాటులోకి రావాలని పిలుపునిచ్చారు.
Justice Gavai
BR Gavai
Chief Justice of India
creamy layer
SC ST reservations
reservation benefits
Supreme Court
constitution
social justice
Ambedkar

More Telugu News