Lionel Messi: మెస్సీతో రేవంత్ రెడ్డి టీం ఫుట్‌బాల్ మ్యాచ్... ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Lionel Messi to Play Football Match with Revanth Reddy Team
  • డిసెంబర్ 13న రేవంత్ రెడ్డి టీంతో లియోనెల్ మెస్సీ మ్యాచ్
  • ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష
  • మెస్సీకి కట్టుదిట్టమైన భద్రత.. అభిమానులకు ప్రత్యేక సూచనలు
  • 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీని నియమించే అవకాశం
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జట్ల మధ్య జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాట్లపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డి. శ్రీధర్ బాబు ఆదివారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 13న జరగనున్న ఈ మ్యాచ్ కోసం చేస్తున్న సన్నాహాలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తదితర ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రత, సౌకర్యం దృష్ట్యా అందరూ ముందుగానే వచ్చి తమ సీట్లలో కూర్చోవాలని సూచించారు. మెస్సీకి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని, ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర వీఐపీల రాకపోకల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు.

'తెలంగాణ రైజింగ్' వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మెస్సీ స్వయంగా ఆసక్తి చూపారని భట్టి పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌తో పాటు 'తెలంగాణ రైజింగ్' కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. క్రీడలు, పర్యాటకం, పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.

ఈ మ్యాచ్ కేవలం స్నేహపూర్వకమైనదే కాదని, ఒక సామాజిక లక్ష్యం కోసం మెస్సీ ఇక్కడికి వస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 'రేవంత్ రెడ్డి 9 వర్సెస్ లియోనెల్ మెస్సీ 10' పేరుతో జరిగే ఈ మ్యాచ్‌లో సీఎం జెర్సీ నంబర్ 9 ధరించనుండగా, మెస్సీ తన ఫేమస్ జెర్సీ నంబర్ 10తో బరిలోకి దిగనున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులకు సీఎం జట్టులో ఆడే అవకాశం కల్పించనున్నారు.
Lionel Messi
Revanth Reddy
Telangana Rising
Messi football match
Telangana sports
D Sridhar Babu
Mallu Bhatti Vikramarka
Hyderabad
Football exhibition match
Global brand ambassador

More Telugu News