Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో ప్రేమాయణంపై అధికారిక ప్రకటన చేసిన పాప్ గాయని కేటీ పెర్రీ

Katy Perry Officially Announces Relationship with Justin Trudeau
  • కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రేమను ధృవీకరించిన కేటీ పెర్రీ
  • జపాన్ పర్యటన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అమెరికన్ సింగర్
  • ట్రూడో భాగస్వామిగా కేటీ పెర్రీని పేర్కొన్న జపాన్ మాజీ ప్రధాని కిషిదా
  • గత అక్టోబర్‌లో పారిస్‌లో తొలిసారి జంటగా కనిపించిన వైనం
అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య ఉన్న ప్రేమబంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. తమ రిలేషన్‌షిప్‌ను కేటీ పెర్రీ అధికారికంగా ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జస్టిన్ ట్రూడోతో కలిసి ఉన్న పలు ఫోటోలను షేర్ చేసి, తమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

ఇటీవల జపాన్‌లో పర్యటించిన ఈ జంట, అక్కడ దిగిన ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా, ఒకరినొకరు హత్తుకుని సెల్ఫీ తీసుకున్నారు. మరొక వీడియోలో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ పోస్ట్‌కు "టోక్యో టైమ్స్ ఆన్ టూర్ అండ్ మోర్" అని కేటీ పెర్రీ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ పరిణామం జరగడానికి కొద్ది రోజుల ముందే జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీతో కలిసి జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిదా, ఆయన భార్య యూకోను కలిశారు. ఈ భేటీ తర్వాత కిషిదా ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. అందులో కేటీ పెర్రీని ట్రూడో భాగస్వామి (partner) అని సంబోధించారు. "కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తన భాగస్వామితో కలిసి జపాన్ వచ్చారు. మేమిద్దరం కలిసి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేశాం. ఆ స్నేహం ఇలా కొనసాగుతుండటం సంతోషంగా ఉంది" అని కిషిదా పేర్కొన్నారు.

కేటీ పెర్రీ (41), జస్టిన్ ట్రూడో తొలిసారిగా గత అక్టోబర్ 25న పారిస్‌లో కేటీ పుట్టినరోజు సందర్భంగా జంటగా కనిపించారు. అంతకుముందు జూలైలో కెనడాలో తమ పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్ చేస్తూ కెమెరా కంటపడ్డారు. మాంట్రియల్‌లో కలుసుకున్నప్పటి నుంచే ట్రూడో ఆమెను ఇష్టపడుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి.
Katy Perry
Justin Trudeau
Katy Perry Justin Trudeau
Canada
Pop Singer
Fumio Kishida
Japan
Tokyo
Celebrity Relationship

More Telugu News