Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

Hyderabad Road Accident Two Youths Died in Lalaguda
  • హైదరాబాద్ లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
  • అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
  • ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుప‌త్రిలో చికిత్స
  • టిఫిన్ కోసం వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన
హైదరాబాద్ నగరంలో ఇవాళ‌ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకకు టిఫిన్ చేసేందుకు కారులో బయలుదేరారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో లాలాపేట వద్దకు రాగానే, కారు అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మల్కాజ్‌గిరికి చెందిన హర్షిత్ రెడ్డి (22), చెంగిచర్లకు చెందిన శివమణి (23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన సమీపంలోని ఆసుప‌త్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు కారును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమ‌ని పోలీసులు తెలిపారు.
Hyderabad
Hyderabad Road Accident
Harshith Reddy
Lalaguda
Road Accident
Car Accident
Telangana
Tarnaka
Keesara
Traffic Accident

More Telugu News