Saiful: తమిళనాడులో చిరుత దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి

Tamil Nadu Leopard Kills 5 Year Old Saiful in Coimbatore District
  • తేయాకు తోటలో ఆడుకుంటుండగా లాక్కెళ్లిన చిరుత
  • గత 8 నెలల్లో ఇది మూడో మరణం
  • వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర భయాందోళన
  • అటవీ శాఖ పెట్రోలింగ్ ముమ్మరం, స్థానికులకు హెచ్చరికలు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. గత ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో చిరుత దాడిలో చిన్నారులు మరణించడం ఇది మూడోసారి కావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు, అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. వాల్పారైలోని అయ్యర్పాడి తేయాకు ఎస్టేట్‌లో పనిచేస్తున్న అస్సాం వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ (5) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని తేయాకు పొదల నుంచి ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన చిరుతపులి బాలుడిని పట్టుకుని తోటలోకి లాక్కెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోట కార్మికులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటి తర్వాత తోట లోపలి భాగంలో సైఫుల్ మృతదేహాన్ని గుర్తించారు. చిరుత దాడి చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి.

8 నెలల్లో మూడు ఘటనలు
ఈ ఏడాది ఆగస్టు 11న ఇదే ప్రాంతంలోని కావరకల్లు వద్ద నూర్జిల్ హక్ (8) అనే బాలుడు, జూన్ 22న పచ్చమలై వద్ద రోషిణి (4) అనే బాలిక చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనలతో తేయాకు తోటల్లో నివసించే వలస కార్మికుల కుటుంబాలు తీవ్ర భయంతో జీవిస్తున్నాయి. ఎస్టేట్ నివాసాలకు సరైన ఫెన్సింగ్ లేకపోవడం, విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడంతోనే చిన్నారులు సులభంగా చిరుతల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనలతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు, అదనపు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట పిల్లలను బయటకు పంపవద్దని, చిరుత సంచారం కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. వన్యప్రాణుల దాడుల నుంచి రక్షణ కల్పించడానికి శాశ్వత ప్రణాళికను అమలు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Saiful
Tamil Nadu
Coimbatore
Valparai
Leopard attack
Tea estate
Child death
Wildlife
Forest department
Human animal conflict

More Telugu News