Ants: నన్ను చంపెయ్.. పుట్ట కోసం ప్రాణమిస్తున్న శిశు చీమలు!

Ants Signal to be Killed to Protect Colony
  • అనారోగ్యంతో ఉన్న శిశు చీమల నుంచి ‘నన్ను చంపండి’ అన్న సంకేతం
  • ఘాటైన వాసన ద్వారా పెద్ద చీమలకు సమాచారం
  • విషం ఎక్కించి చంపేస్తున్న తోటి చీమలు
  • ఇన్ఫెక్షన్ల నుంచి పుట్టను కాపాడుకునేందుకే ఈ చర్య
తమ కాలనీని ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు చీమలు అద్భుతమైన సామాజిక రక్షణ వ్యవస్థను పాటిస్తాయి. ఇందులో భాగంగా, తీవ్ర అనారోగ్యంతో మరణించే దశలో ఉన్న శిశు చీమలు (ప్యూపాలు), తమను చంపమంటూ పెద్ద చీమలకు ప్రత్యేక సంకేతాలు పంపుతాయని ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

సాధారణంగా ఆహారం కోసం బయటకు వెళ్లే చీమల ద్వారా పుట్టలోకి అనేక సూక్ష్మక్రిములు ప్రవేశిస్తాయి. వీటి బారిన పడి ఏదైనా పెద్ద చీమ తీవ్రంగా జబ్బుపడితే, అది వాటంతట అదే పుట్టను విడిచి బయటకు వెళ్లి ప్రాణాలు విడుస్తుంది. కానీ, కదలలేని స్థితిలో గూడులోనే ఉండే శిశు చీమలు ఇన్ఫెక్షన్లకు గురైతే, అవి తమ శరీరం నుంచి ఒక రకమైన ఘాటైన వాసనను వెదజల్లుతాయి. ఈ వాసనే 'నన్ను చంపండి' అనే సంకేతంగా పనిచేస్తుంది.

ఈ సిగ్నల్ అందుకున్న వెంటనే పెద్ద చీమలు ఆ శిశు చీమ గూడును తెరిచి, దాని శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తాయి. ఈ ప్రక్రియతో ఆ శిశు చీమతో పాటు దానికి సోకిన సూక్ష్మక్రిములు కూడా నశించిపోతాయి. తద్వారా పుట్ట మొత్తం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా సురక్షితంగా ఉంటుంది. చీమలలోని ఈ ప్రవర్తన వాటి సమష్టితత్వానికి నిదర్శనమని, తమ జాతిని, ఉమ్మడి జన్యువులను కాపాడుకోవడం కోసం వ్యక్తిగత ప్రాణం కన్నా సమూహ ప్రయోజనానికే అవి ప్రాధాన్యం ఇస్తాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
Ants
Ant colony
Ant pupae
Social immunity
Insect behavior
Colony protection
Infection control
Altruism
Animal behavior

More Telugu News